8 April, 2026 | 2:41 AM

మక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలి

08-04-2026 12:58 AM

ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు

మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మక్కజొన్న పంట సాగు విస్తీర్ణం పెరిగిందని, అలాగే దిగుబడి కూడా అధికంగా వచ్చిందని, అయితే అందుకు తగ్గట్టుగా మహబూబాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో, రైతులు ప్రైవేట్ ట్రేడర్లను ఆశ్రయించి మద్దతు ధర పొందలేకపోతున్నారని వెంటనే ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంగళవారం మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ ను ఎమ్మెల్సీ సందర్శించి రైతులను మక్కజొన్న కొనుగోళ్ల తీరుపై అలిగి తెలుసుకున్నారు. మార్కెట్లలో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరకొరా కొనుగోలు కేంద్రాల్లో మక్కల కొనుగోలు వేగవంతంగా నిర్వహించకపోవడం వల్ల ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నట్లు చెప్పారు. వెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ దృష్టికి తీసుకువెళ్లారు.

మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచి, ప్రస్తుతం మార్కెట్లలో కొనుగోలు కోసం నిరీక్షిస్తున్న రైతులకు అండగా నిలవాలని కోరారు. మక్కలు పండించిన రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన క్వింటాలకు 2400 రూపాయలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం విడాలని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన మక్కల కొనుగోలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బానోత్ రవి, జేరిపోతుల వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.