15 May, 2026 | 3:50 AM

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో మొక్కజొన్న కొనుగోళ్లు

15-05-2026 01:32 AM

మహబూబాబాద్, మే 14 (విజయక్రాంతి): మక్కజొన్న రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పకడ్బందీ చర్యలు చేపట్టారు. 25 కొనుగోలు కేంద్రాలకు 25 మంది ప్రత్యేక అధికారులను పర్యవేక్షణ కోసం నియమించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను వెంటవెంటనే రైస్ మిల్లులు, గోదాములకు తరలించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

గురువారం మధ్యాహ్నం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశం మందిరంలో మార్క్ఫెడ్, వ్యవసాయ, సహకార, పౌరసరఫరాలు, పోలీస్, 25 మంది ప్రత్యేక అధికారులు, లారీ కాంట్రాక్టర్స్, అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థా యిలో వెంట వెంటనే చర్యలు తీసుకొని కొనుగోలు చేసిన మక్కలను సంబంధిత గుర్తించిన మిల్లులు, గోడౌన్స్ లకు తరలించడం జరుగుతుందని, లారీ కాంట్రాక్టర్స్ తోపాటు ఇతర సదుపాయాలు ట్రాక్టర్స్, డీసీఎం తదితర వాహనాల ద్వారా నిరంతరం షిఫ్టులవారీగా రేయింబవళ్లు పనిచేయడం జరుగుతుందన్నారు.

ఇప్పటికే జిల్లాలో 59.202 మెట్రిక్ టన్నుల మక్కలను తరలించామని తెలిపారు. పోలీస్, రవాణా శాఖ అధికారుల సమన్వయంతో గోదాములలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి, స్వాధీనపరచుకొని మక్కలను వెంటవెంటనే షిఫ్ట్ చేయడం జరుగుతుందన్నారు. వరి ధాన్యం, మక్క జొన్న కొనుగోళ్ల నిర్వహణపై ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ అధికారి మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, ఆర్డీవో కృష్ణవేణి, అన్ని విభాగాల ప్రత్యేక అధికారులు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.