రిటైర్డ్ జేసీ ఇంట్లో భారీ చోరీ
30 తులాల బంగారు నగలను ఎత్తుకెళ్లిన దుండగులు
సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన
కామారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సుభాష్ నగర్‌లో ఉంటున్న మాజీ జేసీ రవి కుమార్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 30 తులాల నగలు, ఇతర వస్తు సామాగ్రిని ఎత్తుకెళ్లారు.
విషయాన్ని తెలుసుకున్న రవికుమార్ నిజామాబాద్‌కు మంగళవారం వచ్చి ఇంట్లో జరిగిన ఘటనపై మూడవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఇతర వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బైక్ పై వచ్చి చోరీకి పాల్పడి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలలో నమోదైనట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలుకు సంబంధించిన డీడీఆర్‌ను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.






