26 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది?
- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలి
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నారు?
- సీబీఐ విచారణ జరిపించాలి
- మాజీ మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): సింగరేణిలో బొగ్గు మిస్సింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. 26 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చెప్పాలన్నారు. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం ఉంది కాబట్టి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు.
మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడారు. సింగరేణిని ప్రభుత్వం దోచుకుంటుందని ఆరోపించారు. హరీశ్‌రావు, మేము ఆర్జీ వెళ్తే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ఆర్జీ 3 లక్షల 90 వేల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం చెప్పిందని, బుధవారం ఉదయం 11 గంటల కల్లా శ్రీధర్ బాబు ఫోన్ కోసం వెయిట్ చేస్తానని, ఆర్జీ1లో ఉన్న బొగ్గు నిల్వలు చూపించాలని సవాల్ చేశారు. ఇప్పటి వరకు భట్టి నోరు మెదపలేదన్నారు. సింగరేణిని దివాళా తీసే విధంగా ప్రభుత్వం చేస్తోందని, సంవత్సరం నుంచి ఉత్పత్తి లేని అడ్రియాలలో 1 లక్ష 80 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్లు చెప్తున్నారని విమర్శించారు.
సింగరేణి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని గంగుల మండిపడ్డారు. సింగరేణిలో ఎప్పుడూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి బంధువులకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిలో 16 వేల కారుణ్య నియామకాలు కేసీఆర్ చేపట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సింగరేణి అవినీతిపై నిజా, నిజాలు బయట పెట్టాలన్నారు. టీజీబీజీఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి మాట్లాడుతూ... సింగరేణిలో మెడికల్ బోర్డు ఎప్పుడు పెడతారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని, మంత్రి శ్రీధర్ బాబు హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. సింగరేణిలో చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా శిష్యుడు రేవంత్‌రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు.






