విడాకుల కేసులో ప్రియుడిని ప్రతివాది చేయండి
హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూన్ 22(విజయ క్రాంతి): విడాకుల వ్యవహారంలో భార్య ప్రియుడిని కూడా ప్రతివాదిగా చేర్చాలంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. తన భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు కోరుతున్నపుడు, అక్రమ సంబంధ ఆరోపణ లను ఎదుర్కొనే వ్యక్తి వాదన కూడా వింటామని చెప్పింది. వివాహాన్ని రద్దు చేయాలంటూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌లో భార్య తో అక్రమ సంబంధం నెరపుతున్న వ్యక్తిని ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషన్‌ను కింది కోర్టు కొట్టివేసింది. దీంతో భర్త హైకోర్ట్‌లో పిటిషన్‌ను దాఖలు చేశాడు. దీనిపై శనివారం జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్ భార్యకు పెళ్లి కాకముందే మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడించిందని, ప్రేమ విఫలమైందని చెప్ప డంతో పిటిషనర్ నమ్మి పెళ్లి చేసుకున్నాడని లాయర్ వాదించారు.
పెళ్లి తర్వాత కూడా భార్య అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండడం తో భర్త పెళ్లి రద్దు కోరుతున్నాడన్నారు. దీంతో కోర్టు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తినీ ప్రతివాదిగా చేర్చాలన్న దాఖలు చేసిన పిటిషన్ కింది కోర్టు కొట్టివేసిందన్నారు. అక్రమ సంబంధాన్ని నిర్ధారిస్తూ ప్రియుడి భార్య కోర్టుకు అఫిడవిట్ సమర్పించారన్నారు. ప్రతివాది అయిన భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్రమ సంబంధం పేరుతో భర్త వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. భార్యను స్నేహితులు, కుటుంబసభ్యులను కూడా కలవడానికీ అనుమతించడంలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయ మూర్తి అక్రమ సంబంధం ఉందం టూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరణ ఇచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అవ కాశం ఇవ్వాలన్నారు. అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి భార్య ఇచ్చిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా పిటిషనర్ దరఖాస్తును తిరస్కరించడం చట్టవిరుద్ధమని అన్నారు.






