ఎకో టూరిజానికి ప్రణాళికలు
రాష్ట్రంలోని 12 సర్కిళ్లలో 40 టూరిజం స్పాట్ల గుర్తింపు
వన్యప్రాణాలకు ఎలాంటి హాని కలుగకుండా పర్యాటకాభివృద్ధి
మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): వన్యప్రాణులకు ఏ హాని లేకుండా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, అందుకు తగినట్లు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం ఎకో టూరిజంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని 12 సర్కిళ్ల పరిధిలో మొత్తం 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించమన్నారు. వాటిని అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ స్పాట్లుగా మారుస్తామన్నారు.
వాటి రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలు సమష్టిగా సమన్వయంతో పనిచేస్తాయన్నారు. గత ప్రభుత్వం ఎకో టూరిజం పాలసీ రూప కల్పన పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. ఒడిశా, కర్నాటకలో అమలవుతున్న ఎకో టూరిజం విధానాలను రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు. పీపీపీ పద్ధతిలో నిధు లు సేకరించి ఆయా స్పాట్లను అభివృద్ధిచేస్తామన్నారు. సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు.






