సమాజంలో బాధ్యతాయుత మార్పుకే 'సంస్కార్'
యువత, కుటుంబాల్లో నైతిక విలువల పెంపే లక్ష్యం
'సంస్కార్ మెగా కౌన్సెలింగ్' లో మల్కాజిగిరి సీపీ సుమతి
ఉప్పల్,(విజయక్రాంతి): ప్రతి ఒక్కరి ప్రవర్తనలో ధనాత్మక మార్పు తీసుకురావడమే కాకుండా, సమాజంలో బాధ్యతాయుత జీవన విధానాన్ని మరియు నైతిక విలువలను పెంపొందించడమే 'సంస్కార్' కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో స్థానిక ఏఎస్ రావు నగర్‌లోని అన్నపూర్ణ కమిటీ హాల్లో "సంస్కార్ మెగా కౌన్సెలింగ్–2026" అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సుమతి మాట్లాడుతూ.. కేవలం చట్టాలు, పోలీసు చర్యల ద్వారానే కాకుండా, వ్యక్తుల్లో అంతర్గత మార్పు వచ్చినప్పుడే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
కుటుంబ వ్యవస్థ, యువతపై ప్రత్యేక దృష్టి
సమాజంలో మహిళల రక్షణ, జెండర్ సెన్సిటైజేషన్, కుటుంబ సంబంధాలు మరియు సామాజిక విలువలపై ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలని సీపీ సూచించారు. ముఖ్యంగా యువత దారి తప్పకుండా వారిని సరైన మార్గంలో నడిపించడంలో, కుటుంబాల్లో సత్సంబంధాలు పెంపొందించడంలో ఈ మెగా కౌన్సెలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
బాధితుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ లభ్యత
వ్యక్తిగత, కుటుంబ, లేదా సామాజిక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు నేరుగా కౌన్సెలింగ్ పొందేందుకు వీలుగా 87126 62111 అనే ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అవసరమున్న ప్రజలు, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి కమిషనరేట్ ఉన్నతాధికారులు, షీ టీమ్స్ సిబ్బంది, అన్నపూర్ణ కమిటీ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, యువత పాల్గొన్నారు.






