మేడిపల్లిలో కల్తీ మసాలాలు పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు
సుమారు రూ. 25 లక్షల విలువైన కల్తీ మసాలాలు స్వాధీనం
మేడిపల్లి ఆగస్టు 20 (విజయక్రాంతి) : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు 25 లక్షల రూపాయల విలువైన కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి కమీషనరేట్ పరిధిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషనర్ సుమతి మాట్లాడుతూ శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌లో అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కారం పొడిలో ఏకంగా 30 శాతం రంపపు పొట్టు కలుపుతున్నట్లు బయటపడింది.అంతేకాకుండా, ప్రముఖ బ్రాండ్‌ను పోలి ఉండేలా స్వస్తిక్ డిష్ పేరుతో డూప్లికేట్ లేబుల్స్, ప్యాకింగ్‌తో ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడిలో 2,300 కిలోల పసుపు, 3,350 కిలోల కారం, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా స్వాధీనం చేసుకున్నారు. ఈవ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని, తదుపరి చర్యల కోసం మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. దాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. కల్తీ ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్యాకెట్‌పై బ్రాండ్ పేరు, తయారీ-గడువు తేదీలు, బ్యాచ్ నంబర్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సిపి సూచించారు.






