17 July, 2026 | 1:25 PM

ఈటలకు జైకొట్టిన మల్కాజిగిరి

05-06-2024 01:09 AM

రేవంత్ సిట్టింగ్ సీటులో ఎగిరిన కాషాయ జెండా

వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిన కౌంటింగ్

మొదటి రౌండ్ నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీజేపీ 

కనీస ప్రభావం చూపని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ 

మేడ్చల్, జూన్ 4 (విజయక్రాంతి): మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఓటర్లు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు జైకొట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిపై 3,91,474 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటులో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మొదటి రౌండ్ నుంచి భారీ ఆధిక్యతను నమోదు చేసుకున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మల్కాజిగిరి గడ్డపై మొదటిసారిగా కాషాయ జెండా ఎగరేశారు. ప్రతి రౌండ్‌లో ఈటల రాజేందర్ మెజార్టీ సాధించడంతో వార్ వన్ సైడ్ అన్నట్లుగా మారింది.

రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి స్థానికేతరులు కావడం, లోకల్ క్యాడర్ సహకరించకపోవడం ఆమె ఓటమికి ప్రధాన కారణమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇకపోతే నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ అభ్యర్థి మూడో స్థానానికే పరిమితమయ్యారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మొన్నటి దాకా కాంగ్రెస్‌లో ఉండి టికెట్ రాకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరి టికెట్ తెచ్చుకున్నప్పటికీ ప్రజలు ఆయనను ఆదరించలేదు.  

ఈటలకు కలిసొచ్చిన సొంత ఇమేజ్..

తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. దీనికి తోడు సొంత ఇమేజ్ కలిసి రావడం, గజ్వేల్, హుజురాబాద్‌లో ఓడిపోయాడనే సానుభూతికి మోడీ ఛరిష్మా తోడవడంతో దేశంలోనే పెద్ద నియోజకవర్గంలో ఈటల అఖండ విజయం సాధించారు. యువత బీజేపీ వైపు మొగ్గు చూపారు. నియోజకవర్గ పరిధిలో బీజేపీకి పెద్దగా ప్రజాదరణ ఉన్న నాయకులు లేనప్పటికీ ఈటల తన సొంత ఇమేజ్‌తో గెలిచారని అతని అనుచరులు పేర్కొంటున్నారు.