తెలంగాణకు బీజేపీ ఓ ఆశాదీపం
కాంగ్రెస్‌పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రజలకు బీజేపీ ఓ ఆశాదీపంలా తోచిందని, అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 ఎంపీ సీట్లు సాధించి సత్తా చాటినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీల పేరిట హామీలు ఇచ్చి, వాటిని 100 రోజుల్లో నెరవేరుస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, అది ఈ ఎన్నికల్లో నిరూపితమైందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సంబురాల్లో పాల్గొన్నారు.
అనంతరం మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అన్న రేవంత్‌రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని దుయ్యబట్టారు. మొత్తం సీట్లలో 50శాతం కూడా రాలేదని, ఇది ఏ విధంగా రెఫరెండమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఫేక్ వీడియోలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూసిందని ఆగ్రహించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూశారని విమర్శించారు.
తాము మరింత కష్టపడి పనిచేస్తే మరిన్ని సీట్లు సాధించేవాళ్లమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై చర్చించుకుని రానున్న రోజుల్లో ముందుకు సాగుతామని చెప్పారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో అత్భుత విజయం సాధించారని పేర్కొన్నారు.






