20-12-2025 12:00:00 AM
* ఫీడర్ ఛానల్, కాలువల ఆధునీకరణకు ప్రతిపాదనలు
* మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరిన జగ్గారెడ్డి
సంగారెడ్డి, డిసెంబర్ 19(విజయక్రాంతి): సంగారెడ్డి నియోజకవర్గంలోనే పెద్దదైన మల్కాపూర్ చెరువు ఫీడర్ ఛానల్, కాలువల ఆధునీకరణకు మహర్ధశ రానుంది. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డిని కలిసి ఆధునీకరణకు ప్రతిపాదనలు చేశారు. ఇందులో మల్కాపూర్ పెద్ద చెరువుకు మేకవనంపల్లి కత్వా నుండి వచ్చే 15 కిలోమీటర్ల ఫీడర్ ఛానల్, పెద్ద చెరువు నుండి కలబ్ గూర్ కు వెళ్ళే 9 కిలోమీటర్ల మేర కాలువ, పెద్దచెరువు ఆయకట్టుకు వెళ్లే 4 కిలో మీటర్ల కాలువను ఆధునీకరించాలని మంత్రిని కోరారు.
స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ సలహాల ప్రకారం మల్కాపూర్ పెద్ద చెరువు కట్టను బలోపేతం చేయడం, కట్ట వెడల్పు, సుందరీకరణ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే పెద్ద చెరువు విస్తీర్ణంలో అతి పెద్దది. 2600 ఎకరాల ఆయకట్టు కలిగి ఉన్న ఈ పెద్ద చె రువు దశాబ్దానికి పైగా మరమ్మత్తులకు నోచుకోలేదు. దీని నిలువ సామర్ధ్యం 0.8 టీఎంసీలు. సంగారెడ్డి నియోజకవర్గంలోని ఆరు చెరువులకు పెద్ద చెరువే ఆధారం.
దీనిని ఆధునీకరించడం వల్ల దీని కింద ఉన్న చెరువులను పూర్తిగా నింపడం, ఆయకట్టు విస్తీర్ణం పెంచడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మల్కాపూర్ పెద్ద చెరువులో నీళ్ళు నిండుగా ఉంటేనే సంగారెడ్డి పట్టణంలో భూగర్భ జలాలు సమృద్దిగా ఉంటాయి. సుందరీకరణ పూర్తయితే పర్యాటకంగా అభి వృద్ధి చెందుతుంది. జగ్గారెడ్డి ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.