14-12-2025 01:39:52 AM
హాజరుకానున్న 25 వేల మంది భక్తులు
మూడు రోజులపాటు వైభవంగా ఉత్సవాలు
పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ
జనవరి 18 నుంచి మూడు నెలలపాటు మహా జాతర
సిద్దిపేట, డిసెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తోట బావి వద్ద జరిగే ఈ వేడుకను భక్తులు తిలకించడానికి అన్ని వసతులు కల్పించారు. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ వేడుక జరుగనున్నది. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం మల్లన్న కల్యాణం నిర్వహిస్తారు.
ఆదివారం ఉదయం 10.45 గంటలకు వరుడు మల్లికార్జునస్వామి తరఫున పడగన్నగారి వంశస్థులు, వధువులు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ తరఫున మహాదేవుని వంశస్థులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించి స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరపనున్నారు. ఈ క్రతువు ఈసారి సంగారెడ్డి జిల్లా బర్దీపూర్ ఆశ్రమ వీరశైవ ఆగమ సంప్రదాయ పీఠాధిపతులు మహంత్ సిద్దేశ్వరానందగిరి మహాస్వామి పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.
అర్చక బృందం మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవార్లకు మాంగల్య ధారణ గావిస్తారు. ఈ కల్యాణ మహోత్సవం మూడు రోజులపాటు సాగుతుంది. 14న ఉదయం 5 గంటలకు బలి హరణంతో మొదలై, కల్యాణం అనంతరం రుద్రాభిషేకం, సాయంత్రం 7 గంటలకు రథోత్సవం,15న ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు లక్ష బిల్వార్చన, మంగళ హారతితో ముగుస్తుంది.
పటిష్టమైన భద్రత
గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పోలీస్ శాఖ వారు ప్రతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిద్దిపేట సీపీ సంజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి, ఏసీపీ సదానందం పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా భారికేడ్లను నిర్మించి, వీఐపీ దారి, భక్తుల దారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతేగాక భద్రతకు అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలతో కలిసి మొత్తం 350 మంది పోలీస్ సిబ్బంది భద్రత ఏర్పాట్లలో నిమగ్నమై ఉంటారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కల్యాణోత్సవం జరగనున్నది.
ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు
సుమారు 25 వేల మంది భక్తులు స్వామి వారి కల్యాణానికి రానున్నట్లు ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్లు ఏర్పాట్లను చేశారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు
స్థానిక సంస్థల ఎన్నికల మూలంగా రాష్ట్రంలో మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ప్రత్యేక అనుమతితో స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ పట్టు వస్త్రాలు, తలంబ్రాలు ముహూర్త సమయాన స్వామివారికి సమర్పించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ రానున్నడంతో పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది.
మూడు నెలల పాటు జాతర
కల్యాణోత్సవం మూగిసిన తర్వాత జనవరి రెండో వారం నుంచి జాతర ప్రారంభం అవుతుంది. మూడు నెలల పాటు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. అందుకు అనుగుణంగా సౌకర్యాలను ఆలయ వర్గాలు ఏర్పాటు చేస్తారు.
జాతర ముఖ్య ఘట్టాలైన శివరాత్రి నాడు పెద్దపట్నం, ఉగాదికి ముందు ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాకుండా జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే రెండు ఆదివారాలు హైదరాబాదు నుంచి ప్రత్యేకంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
పట్నం ఆదివారం సందర్భంగా హైదరాబాద్ యాదవులు తోట బావి వద్ద తమ సొంత డబ్బులతోనే పెద్దపట్నాన్ని, అగ్నిగుండాలను తయారు చేసుకుని, పట్నం, అగ్ని గుండాలను తొక్కి మొక్కులు చెల్లించుకొని తరిస్తారు. ఉగాది కంటే ముందు ఆదివారం నాడు ఏర్పాటు చేసే అగ్నిగుండాల కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.