సూర్యాపేటలో ఏసీబీ దాడులు – ఏడుచోట్ల సోదాలు, ఏడీఏ కిరణ్ కుమార్ అదుపులో
ఒకేసారి ఏడుచోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు
ఆయన స్వగ్రామంలో దాడులు
సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో(Suryapet District) గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన సుందరి కిరణ్ కుమార్ ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కల్వకుర్తిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఏడీఏ పనిచేస్తున్నారు. అయితే ఆయన స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లోని పొనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు ఉదయం దాడులు నిర్వహించారు.
ఆదాయం మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ(Mahbubnagar ACB DSP) బాలకృష్ణ తెలిపారు. కిరణ్ కుమార్ ఇంటితోపాటు ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు(ACB officials) ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన భాగస్వామిగా ఉన్న నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామ శివారులోని అవని రైస్ మిల్లులో కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
నేరేడుచర్ల, కల్వకుర్తితో పాటు ఆయన పనిచేస్తున్న ఆఫీస్, గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలోని ఆయన అత్తగారి ఇల్లు, ఆయన కూతురు ఊరైన అనంతగిరి మండలంలోని అమీనాబాద్, అలాగే సూర్యపేటలో ఆయన నివాసం ఉంటున్న కిరాయి ఇంట్లో, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ లోని కిరాయి ఇంట్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాడులు నిర్వహిస్తున్న సమయంలో కిరణ్ కుమార్ పోనుగోడులోనే ఉన్నారు. ఏసీబీ అధికారులు ఏడిఏ కిరణ్ కుమార్ ను దర్యాప్తు కొరకు వారి వెంట తీసుకువెళ్లారు. దర్యాప్తు పూర్తి అయ్యాక పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తుంది.






