14-12-2025 01:36:29 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ ౧౩: చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో).. అచ్చ తెలుగులో అయితే.. ముఖ్య కార్యనిర్వహణ అధికారి.. ఈ పదానికి యావత్ ప్రపంచంలో ఎంతో క్రేజ్ ఉంది. ఆ వ్యక్తి ఒక కార్పొరేట్ సంస్థలో సీఈవోగా సేవలందించేది చిన్న సంస్థనా? పెద్ద సంస్థనా? అన్నది పక్కన పెడితే.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, టోక్యో నుంచి లండన్ వరకూ ఈ పదవికి ఉండే గౌరవాభిమానాలే వేరు.
ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాల్లాగానే భారత్‌లో కూడా ప్రబలంగా ఉంది. సీఈవోకు యాజమాన్యాలు ఇచ్చే సౌఖ్యాలు, సౌలభ్యాలు, వెసులుబాట్లు, విలాసాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. వారిని బెంజ్, మెర్సిడెజ్, పోర్సే కార్లు కేటాయిస్తాయి.
కారు డోర్ తెరిచే దగ్గర్నుంచి, ఆఫీస్‌లోకి ప్రవేశించి కింది ఫ్లోర్ నుంచి కొన్ని అంతస్తులపై ఉన్న తన క్యాబిన్‌కు వెళ్లేవరకూ సీఈవోకు లభించే గౌరవ మర్యాదలు, సెల్యూట్‌లు అన్నీ ఇన్నీ కావు.. . అలాంటిది.. సీఈవో పదవి పో తే..? ఇంకా ఏంటి సంగతులు..? పైనా చెప్పినవన్నీ ఒక్కసారిగా తలకిందులవుతాయి.. జస్ట్ అంతే!
మానసిక పరిస్థితేంటి?
సీఈవోగా పదవీ విరమణ చేసిన, లేదంటే పదవీచ్యుతుడైన తర్వాత ఆ వ్యక్తి మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది. ఒకప్పుడు తన క్యాబిన్‌లో ఎంతో మంది బిజీ బిజీగా బిజెనెస్ మ్యాగ్నెట్లు, బిగ్ షాట్స్‌తో భేటీ అయిన రోజు లు ఇప్పుడండవు. పర్సనల్ సెక్రటరీలు చేయమనే సంతకాలు, మెయిల్స్ అప్రూవల్ చేయ మనే హెచ్‌ఆర్ సిఫార్సులతో గుక్క తిప్పుకోలేని క్షణాలు ఇక ఉండవు.
ఒక విల్లాలోనో, ఒక సాధారణ ఫ్లాట్‌లోనూ.. అతని ఆవాసం ఒక చిన్న గది. చుట్టూ నిశ్శబ్దం. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో అనుభవం ఎలా ఉందంటే.. పొద్దున్నే అతడి పర్సనల్ సెక్యూరిటీ అత్యవసర కాల్స్ చేయాలనే జాబితా ఇచ్చే వాడు. ఇప్పుడది లేదు. మెయిల్‌కు చేరిన వందలాది మెయిల్స్‌కు రిప్లు ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడది లేదు.
నిత్యం కాల్స్ వస్తుండేవి. ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్స్ రింగ్ అవుతూనే ఉండేవి. ఇప్పుడా శబ్దాలు లేవు. వీకెండ్‌లో గతంలో తాను బుక్ చేసుకున్న గోల్ఫ్‌స్లాట్ ఇప్పుడు ఖాళీగా లేదు. ఇప్పుడా.. స్లాట్ తాను పనిచేసిన కంపెనీలో చేరిన కొత్త సీఈవోకు వెళ్లింది. ఇంటి గేటు వద్ద సెక్యూరిటీ లేదు. సేవలందించే బంట్రోతులు లేరు. వంట వండే చెఫ్‌లు లేరు. ఉన్నట్టుండి స్నేహాలు కూడా దూరమయ్యాయి.
పదవి ఉన్నంత వరకే ఈ స్నేహాలను సదరు మాజీ సీఈవో అప్పుడు తెలుసుకున్నాడు. ఒకప్పుడు తన మ్యుచువల్ ఫండ్స్, ఇతర సర్టిఫికెట్లు, అఫిడవిట్ల, బ్యాంక్ ఖాతా అప్‌డేట్లన్నీ గతంలో తన వ్యక్తిగత సిబ్బంది చూసుకునేవారు. ఇప్పుడు.. తానే స్వయంగా ఆ పనులు చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాను.. కనీసం ఒక బ్యాంక్ మేనేజర్‌నైనా ఆహ్లాదంగా పలుకరించే మానసిక స్థాయిలో లేడు.
నిజమైన జీవితం తెలుస్తుంది !
మాజీ సీఈఓలు తమ పదవులు, హోదాలు కోల్పోయిన తర్వాత నిజమైన, వాస్తవమైన జీవితాలను చూ స్తున్నారని అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తున్నాయి. తనకు లేని ఆడంబరాలు, హంగులు నాడు అనుభవించాడని తెలుసుకుంటారని అధ్యయనాల్లో తేలింది. ఈ పరిణామాలు, పరివర్తనలను ప్రాక్టికల్ గమనించిన ఎంతో మంది మాజీ సీఈవోలు మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పుంజుకుంటున్నారు.
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సానుకూలంగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఒక టెక్ అనుభవజ్ఞుడు కొత్తగా స్టార్టప్‌లు ప్రారంభించేవారికి సలహాలు ఇస్తుంటే, మరొక పరిశ్రమల నిపుణుడు కొందరు శాస్త్రవేత్తలతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఉపాధి అవకాశాల పెంపు, జీవన ప్రమాణాల మెరుగుదలపై పనిచే స్తున్నాడు. ఇప్పుడు.. ఎలాంటి హోదా, ఎలాంటి అధికారం లేకుండానే వందలాది మందిపై ప్రభావం చూపగలిగే సామర్థ్యాలను , నైపుణ్యాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. కార్పొరేట్ జీవితంలో లేని జీవితాస్వాదనను ఇప్పుడు విశ్రాంత జీవితంలో పొందుతున్నారు.