పైతరలో రథోత్సవం ఊరేగింపు
రమణీయంగా సాగిన మల్లికార్జున స్వామి రథోత్సవం
కొల్చారం(విజయక్రాంతి): శ్రీశ్రీశ్రీ బ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున పైతర గ్రామంలో రథోత్సవం ఊరేగింపు రమణీయంగా సాగింది. రథోత్సవం అలంకరణ గ్రామానికి చెందిన ఎల్లుగారి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బంతిపూలతో విశేషంగా అలంకరణ చేశారు. అనంతరం పల్లకిపై ఊరేగింపుగా ఆలయ ఆవరణలోని స్వామి వార్లను రథంపై కొలువుదీర్చారు.
ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణత్రిపాఠీ ఆచార్య, రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మాదవానంధ సరస్వతి స్వామి పర్యవేక్షణలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం వద్ద టెంకాయలు, గుమ్మడి కాయలు కొట్టిన తరువాత సాంప్రదాయ బద్దంగా రథోత్సవానికి నైవేద్యం సమర్పించి, రథాన్ని ముందుకు లాగారు.
రథంపై మల్లికార్జున స్వామి వార్లను విహరించగా భక్తులు దర్శించుకొని పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేస్తూ గ్రామాస్తులు నీళ్ల సాకలు పెడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ, శివసత్తుల పూనకాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భానుప్రకాష్ రెడ్డి, కోశాధికారి కుమ్మరి శివకుమార్, సభ్యులు మాడబోయిన మల్లేశం, శేఖర్, లక్ష్మీనారాయణ, భూమయ్య, అంతయ్య, రాజు, నర్సింలు, కార్తీక్ రాజు, సాయిలు, సంతు, మల్లేశం గ్రామాస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




