23-11-2025 12:10:13 AM
మామ్దానీపై ప్రశంసల వర్షం కురిపించిన ట్రంప్
వాషింగ్టన్, నవంబర్ 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు డెమొక్రటిక్ పార్టీ యువ నాయకుడు జోహ్రాన్ మామ్దానీపై పీకల్లోతు కోపం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మామ్దానీ ఇటీవల న్యూయార్క్ నగర మేయర్‌గా ఎన్నికైన తర్వాత కూడా ట్రంప్ ఆయనపై అక్కసు వెళ్లగక్కిన సంగతీ విదితమే. కానీ, తాజాగా వారిద్దరి కలయిక యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. వారిద్దరూ వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం ఓవల్ కార్యాలయంలో భేటీ అయి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ట్రంప్ ఈ సందర్భంగా మామ్దానీపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ భేటీ ఎంతో హాయిగా సాగిందని, మామ్దానీ లాంటి యువనేత సేవలు న్యూయార్క్ నగరానికి అవసరమని కితాబునిచ్చారు. మేయర్‌గా మామ్దానీ విజయం నాకెంతో సంతోషాన్నిచ్చిందని ప్లేటు ఫిరాయించారు. న్యూయార్క్ నగరమంటే తన కెంతో ఇష్టమని, ఆ నగరాభివృద్ధిపై తాము చర్చించామని చెప్పుకొచ్చారు.
న్యూ యార్క్‌లో నివసిస్తున్న 85 లక్షల మంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్‌నకు రాజకీయ ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ పార్టీకి చెందిన నేత మామ్దానీకి ఇలాంటి సానుకూల స్పందన రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, మామ్దానీ జనవరి 1న మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.