23-11-2025 12:09:05 AM
ఇక ఒక్క ఏడాది పనిచేస్తే చాలు.. గ్రాట్యుటీ వర్తింపు
అసంఘటిత కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు లబ్ధి
న్యూఢిల్లీ, నవంబర్ 22: అసంఘటిత కార్మికులు, గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులు, వలస కార్మికుల వంటి ఫిక్స్‌డ్ -టర్మ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ ఉద్యోగాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు తాజాగా కార్మిక చట్టాల్లో కీలక మార్పులు చేసింది. నూతన చట్టాల ప్రకారం.. ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులు కేవలం ఒక్క ఏడాది సర్వీస్ పూర్తి చేస్తే చాలు. వారికి గ్రాట్యుటీ పొందేందుకు అర్హులవుతారు.
గతంలో ఈ అర్హత పొందాలంటే కచ్చితంగా ఏకధాటిగా ఐదేళ్లపాటు ఒక సంస్థలో పనిచేయాల్సి వచ్చేది. కొత్త సంస్కరణలు శనివారం నుంచే అమలులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. ఫిక్స్‌డ్ -టర్మ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులతో సమానంగా చూడాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది.
కాంట్రాక్ట్ సిబ్బందిపై ఎక్కువగా ఆధారపడకుండా యాజమాన్యాలు పారదర్శకమైన, ప్రత్యక్ష నియామకాలను ప్రోత్సహించేందుకు సంస్కరణలు ఎంతో ఉపకరిస్తాయి. ఇక నుంచి ఒక సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత రాజీనామా చేస్తే, లేదా పదవీ విరమణ తర్వాత ఆ ఉద్యోగికి పూర్తి స్థాయిలో గ్రాట్యుటీ అందుతుంది. ఈ సంస్కరణ ఎంతో మేలు చేస్తుంది.