23-11-2025 12:11:52 AM
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ నమాన్ష్‌సయాల్ మృతి
యూట్యూబ్ చూస్తూ కొడుకు మరణవార్త తెలుసుకున్న పైలట్ తండ్రి జగన్నాథ్
స్వగ్రామం హిమాచల్ ప్రదేశ్‌లోని నగ్రోటా బాగ్వాన్‌లో విషాదఛాయలు
సిమ్లా, నవంబర్ 22 : కుమారుడి ఎయిర్ వీక్షణ చివరకు ఓ తండ్రికి చేదుజ్ఞాపకాన్ని మిగిల్చింది. భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధవిమానం శుక్రవారం దుబాయ్ ఎయిర్‌షోలో కూలిపో వడంతో వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
అయితే, ఈ దుర్ఘటన వివరాలు యూట్యూబ్‌లో రీల్స్ చూస్తుండగా తెలిసిందని పైలట్ తండ్రి జగన్నాథ్ సయాల్ మీడియాకు తెలిపి కన్నీరుమున్నీరయ్యారు. ఆ చేదుజ్ఞాపకాన్ని మీడియాకు తెలుపుతూ బావ వోధ్వేగానికి గురయ్యారు.
ఎయిర్ షో .. చూడు నాన్న
‘ప్రమాద ఘటనకు ముందు రోజు నమాన్ష్‌తో ఫోన్‌లో మాట్లాడా.. నా షో టీవీ, యూట్యూబ్‌లో వస్తుంది చూడు నాన్నా అని చెప్పాడు.. శుక్రవారం 4గంటల ప్రాం తంలో ఎయిర్ షో లైవ్ వీడియోల కోసం యూట్యూబ్‌లో వెతుకుతున్నా.. అప్పుడే జెట్ క్రాష్ అయ్యిందనే విషయం నాకు తెలిసింది. వెంటనే ఐఏఎఫ్‌లో వింగ్ కమాండ ర్‌గా పని చేస్తున్న నా కోడలుకు కాల్ చేశాను.
కొద్ది సేపటికి ఐదుగురు ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఇంటికి రావడంతో ఏదో జరిగిందని నాకు అర్థమైంది’ అని నమాన్ష్ తండ్రి జగన్నాథ్ సయాల్ మీడియా ఎదుట బోరుమన్నారు. కుమారుడి మృతదేహాన్ని ఎప్పుడు తీసుకువస్తారనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదని తెలిపారు.
అక్కడ అధికారిక ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు రోజుల సమయం పట్టొచ్చని తెలిపారు. నమాన్ష్ సయాల్ మృతితో అతడి స్వగ్రా మం హిమాచల్ ప్రదేశ్‌లోని నగ్రోటా బాగ్వాన్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. నమాన్ష్ తండ్రి జగన్నాథ్ హిమాచల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యగ విరమణ పొందారు.