కారు ఢీకొని వ్యక్తి మృతి
02-05-2026 07:28 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల పరిధిలోని జింకలగూడెం క్రషర్ మిల్ వద్ద కారు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. బూర్గంపాడు అదనపు ఎస్ఐ నాగభిక్షం తెలిపిన వివరాల ప్రకారం... బూర్గంపాడు మండల పరిధిలోని అంజనాపురం గ్రామానికి చెందిన ధారవత్ కిషన్ శనివారం ఉదయం ఇంటి నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం మోరంపల్లి బంజరకు వెళ్తుండగా జింకలగూడెం క్రషర్ మిల్ వద్ద భద్రాచలం వైపు వెళుతున్న ఓ కారు అతి వేగంతో వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే రోడ్డుపై పడి కిషన్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.మృతుడి కుమారుడు చంటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.






