జనరల్ బాడీకి అధికారుల డుమ్మా..
బహిష్కరించిన ప్రజాప్రతినిధులు
సమావేశం 2వ తేదీకి వాయిదా
మునిపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో శనివారం ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2గంటలకు నిర్వహించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా అర్ధగంట ఆలస్యంగా ప్రారంభించారు. సమావేశంలో ఏజెండా చదవే క్రమంలో ఏఏ శాఖల అధికారులు వచ్చారు.. ఎంత మంది డుమ్మా కొట్టారు. అనే దానికి మండల స్పెషలాఫీసర్ రామాచారి మండల అధికారులను అడగగా 18శాఖల అధికారులు రావల్సి ఉండగా కేవలం 6శాఖలకు సంబంధించిన అధికారులు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ ఏఈ తమ ఫోన్ ఎత్తడం లేదు.. సరైనా సమాధానాలు చెప్పడం లేదంటూ ఆయా గ్రామాల సర్పంచులు నారాయణ, మల్లేశం, మల్లేశం , వీరేశం, రాజు, ఈశ్వరప్ప, ఇర్ఫాన్ పటేల్, అశోక్ తదితరులు సభ దృష్టికి తీసుకవచ్చారు. దీంతో స్పందించిన మండల స్పెషలాఫీసర్ విద్యుత్ శాఖ ఏఈ సంతోష్ సమావేశానికి ఎందుకు రాలేదు.. అని ఆ శాఖ ఏఈకి ఫోన్ చేయగా నేను రాను. అందుబాటులో లేను అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహించిన స్పెషలాఫీసర్ రామాచారి నీ కోసమే.. అందరు ఎదురు చూస్తున్నారు.
నీ సమస్యనే ఎక్కువగా ఉంది. మీరు రాకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అలాగైతే వస్తాను ఫోన్ కట్ చేశాడు.. అంతే 40నిమిషాలు అయినా రాలేకపోవడంతో చేసేదేమిలేక ప్రజాప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో సెప్టెంబర్ 2వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేశారు. అంతకు ముందు సమావేశాన్ని ఉద్దేశించి మండల స్పెషలాఫీసర్ రామాచారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, చర్చించుకోవడం కోసమే జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది.. అలాంటి సమావేశాలకు మండల స్థాయి అధికారులే రాకుంటే మీటింగ్ ఎలా జరుగుతుందన్నారు.
మండలంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అధికారులు డుమ్మా కొడితే వారి వివరాలను తమకు అందించాలని ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ రామలింగంను ఆదేశించారు. అదే విధంగా జనరల్ బాడీకి వచ్చే అధికారులు ఏజెండాలతో రావాలని, నిర్లక్ష్యం చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే ఎంపీఓ క్రిష్ణకుమార్ కూడా డుమ్మా కొట్టడంతో ఆయన ఆగ్రహం వక్తం చేశారు.
అనంతరం రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులందరికి అందేలా చూసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాంటి అధికారులే మండల సభలకు డుమ్మాలు కొడితే ప్రజలకు ఎవరు సమాధానాలు చెబుతారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రంగారావు, మండల వ్యవసాయాధికారి అనితారెడ్డి , డాక్టర్ సంధ్యారాణి, ఎంఈఓ భీంసింగ్, ఏపీఎం నర్సింలు, ఏపీఓ యాదగిరి, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






