13 April, 2026 | 5:38 PM

కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?

13-04-2026 04:03 PM
  1. 4 జీ ఫోన్లు ఇస్తూ.. 5జీ ఫోన్లు అంటున్నారు
  2. అంగన్‌వాడీ టీచర్ల స్మార్ట్ ఫోన్లలో అవినీతి..
  3. 35,310 స్మార్ట్ ఫోన్ల కోసం రూ. 54 కోట్లకు టెండర్
  4. సమాధానం చెప్పమంటే... సీతక్క చెప్పుతో కొడతామంటున్నారు...

హైదరాబాద్: అంగన్‌వాడీ టీచర్ల స్మార్ట్ ఫోన్లలో(Anganwadi Teachers Smartphones) అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ ఆరోపించారు. 35,310 స్మార్ట్ ఫోన్ల కోసం రూ. 54 కోట్లకు టెండర్ ఇచ్చారని తెలిపారు. స్మార్ట్ ఫోన్లపై రూ.24 కోట్లే ఖర్చు చేశారు, మిగతా రూ. 30 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. 4 జీ ఫోన్లు ఇస్తూ.. 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారని మన్నె క్రిశాంక్(Manne Krishank ) పేర్కొన్నారు. సమాధానం చెప్పమంటే సీతక్క చెప్పుతో కొడతామంటున్నారని మన్నె క్రిశాంక్ ఫైర్ అయ్యారు. తాము అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీతక్క అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క కేసీఆర్ కు ఎందుకు లీగల్ నోటీసులు పంపించారని మండిపడ్డారు.

స్మార్ట్ ఫోన్ల కొనుగోలులో స్కామ్‌కు పాల్పడి 4జీ ఫోన్లు ఇస్తూ… 5జీ ఫోన్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న వారిని ఏ చెప్పుతో కొట్టాలో సీతక్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల కోసం ఇచ్చే స్మార్ట్ ఫోన్ల కాంట్రాక్ట్‌కు సీతక్కకు సంబంధమే లేదంటూనే, ఇప్పుడు చెప్పుతో కొడుతానని అనడం ఏంటీ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వం... అందుకే ఈ ప్రభుత్వం చేసే విచారణపై తమకు నమ్మకం లేదని ఆరోపించారు. ఈ స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి, సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు.