30 June, 2026 | 4:02 PM

యూరియా యాప్ ను వెంటనే రద్దు చేయాలి

30-06-2026 03:30 PM

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి 

అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) డిమాండ్

దమ్మపేట,(విజయక్రాంతి):  రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, యూరియా యాప్ ను రద్దు చేయాలని, కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించాలని కోరుతూ తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ కు అందించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకురాలు తోడం దుర్గమ్మ, అఖిలభారత ఐక్య రైతు సంఘం డివిజన్ అధ్యక్షులు పండూరి వీరబాబులు మాట్లాడుతూ... ఖరీఫ్ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్న రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు పరిపూర్తిగా లభించడం లేదన్నారు.

అరకొరగా కురిసిన వర్షానికి విత్తిన విత్తనాలు మొలవక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, వర్షాభావ పరిస్థితులవలన వర్షాలు ఆలస్యం వల్ల ఖరీఫ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైందని అన్నారు. రైతులకు సకాలంలో యూరియా యాప్ ద్వారా యూరియా, డిఎపి, కాంప్లెక్స్ ఎరువులు అందటం లేదన్నారు. వీరి కి అవసరమైన మేరకు ఎరువులను పెట్టుబడికై బ్యాంకు రుణాలను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను గుర్తించి  వారికి ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు, యూరియా, డిఏపి తో పాటు కాంప్లెక్స్ ఎరువులు సబ్సిడీపై ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన యూరియా, డిఏపి కాంప్లెక్స్ ధర లను తగ్గించి సబ్సిడీలను కొనసాగించాలని కోరారు.

రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా పంటలకు మద్దతు ధరలు(MSP) చట్టం చేయాలని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, పంట కొనుగోలు పరిమితులను విధిస్తే రైతులు నష్టపోతారన్నారు.  అదే విధంగా ఖరీఫ్ సీజన్ లో రైతు భరోసా సకాలంలో ఇవ్వవలసిన ప్రభుత్వం నేటికీ విడుదల చేయలేదన్నారు. ఒకే దఫాలో  రైతు భరోసా చెల్లించాలని, గత బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వరి పంటలు అమ్మిన రైతాంగానికి వరి కొనుగోలు చేసిన బిల్లులు, బోనస్ లన్నిటిని చెల్లించడం లేదన్నారు. కొన్నిచోట్ల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నాయని, బకాయిలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.