మంథని ఎంపీవో ఆరిఫ్‌పై వేటు
వెలుగులోకి మహిళా కార్యదర్శులపై వేధింపులు
విచారణలో ఆర్థిక నేరాలు
మంథని, జూన్ 11 (విజయక్రాంతి): మంథని మండల పంచాయతీ అధికారి మొహమ్మద్ ఆరిఫ్ హుస్సేన్‌పై పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ మంగళవారం వేటువేశారు. ఆరిఫ్‌ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయిమెంట్ హైదరాబాదు కార్యాలయానికి సరెండర్ చేశారు. ఏడాదికాలంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, క్రిందిస్థాయి ఉద్యోగులను ఎంపీవో వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఉద్యోగులు ఇటీవల జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కలెక్టరుకు ఫిర్యాదు చేశారు.
స్పందించిన కలెక్టర్ విచారణ అధికారిగా జడ్పీ సీఈవోను నియమించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విచారణలో ఆరిఫ్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలింది. మహిళా పంచాయతీ కార్యదర్శుల పట్ల అనుచితంగా వ్యవహరించడం, వేధించడం, అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడటం, విధులు సక్రమంగా నిర్వర్తించనట్టు కలెక్టర్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఆరిఫ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టరు.. అతడిని విధుల నుంచి తప్పించారు.






