22 August, 2026 | 7:07 PM

ఆలయ అభివృద్ధి పనులపై అధికారుల స్థల పరిశీలన

22-08-2026 06:17 PM

అమీన్ పూర్, ఆగస్టు 22(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శనివారం స్థల పరిశీలన చేపట్టారు. దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ శర్మ, అసిస్టెంట్ ఇంజనీర్ తులసీరామ్, అసిస్టెంట్ స్థపతి వెంకటేశ్వరరావు ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి దేవనాదం, చైర్మన్ సుధాకర్ యాదవ్, పాలకమండలి సభ్యుల సమక్షంలో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు అవసరమైన స్థలాలను పరిశీలించారు. ముఖ్యంగా శివాలయ విగ్రహం ఏర్పాటు, 16 వసతి గృహాలు, హోమశాల, వేద పాఠశాల, సోలార్ వ్యవస్థ తదితర సౌకర్యాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు.

ఆలయ భవిష్యత్ అవసరాలు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులకు సంబంధించిన తగిన ప్లానింగ్, ఎస్టిమేషన్లు, కొటేషన్లు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.