చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి
- వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు
- తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలయ్యారు
- సీఎం హోదాలో ‘చీప్’గా మాట్లాడటం పద్ధతి కాదు
- ‘సీఎం పరిచయ కార్యక్రమం’ అని బ్యానర్ కట్టుకుని ఊరూరు తిరగండి’
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాజకీయాల్లో చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని, కొత్త పార్టీలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కవిత టీఆర్‌ఎస్ పేరుతో పెట్టిన పార్టీపై కేటీఆర్ స్పందిస్తూ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. కేసీఆర్ గురించి చాలా మంది మాట్లాడు తున్నారని, వాటన్నింటికీ సమాధానం చెప్పడానికి మాకు ఖాళీ లేదు, మాకు చాలా పనులు ఉన్నాయని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పార్టీ రాష్ట్ర కమిటీని ఉద్దేశించి పూర్తిస్థాయి దిశానిర్దేశం చేశారని, తెలంగాణ కోసం మా వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారని చెప్పారు. పార్టీలో చేరిన సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డిని జనరల్ సెక్రటరీగా పరిచయం చేసి ప్రకటించారని తెలిపారు.
పార్టీ 25 సంవత్సరాల పాటు తెలంగాణ కో సం సాగించిన పోరాటాన్ని, ఉద్యమాన్ని, ప్రభుత్వ పరిపాలన పరిణామక్రమాన్ని వివరించారన్నారు. ఒకనాడు ప్రతి పంటకు 10 రోజుల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు పంపితే, ఈరోజు నెలలు దాటినా ఒక్క పైసా పడని ప్రభుత్వ అపసోపాల గురించి, రాష్ట్ర రైతాంగం పడుతున్న బాధలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ తెలంగాణ ఏర్పాటుకు ముందున్న వ్యవసాయ సంక్షోభం తిరిగి వచ్చిందన్నారు.
కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, విత్తనాల కొరత, ఎరువుల కొరత, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం వంటి సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా మంత్రులు చర్చో పచర్చలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారని, సింగరేణి సంస్థకు, కార్మిక లోకానికి చేసిన అభివృద్ధిని కూడా వివరించారని చెప్పారు. విఫలమవుతుందన్న తెలం గాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపితే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా చేస్తుందన్నారు.
భూముల కబ్జాలు, ఇళ్ల కూల్చివేతల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలుపుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ వంటి పథకాన్ని నడిపి తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజ స్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోలుస్తూ మరి ఒక వేర్పాటువాద సమస్యగా చిత్రీకరించడమే కాకుండా తులనాడే విధంగా అవమానించే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే విధంగా వారేదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా సమావేశం ఖండించిందన్నారు.
నిజంగా అక్కడ ఒక్క బీఆర్‌ఎస్ ఎంపీ ఉన్నా లోక్ సభలో మరి వెంటనే తిరగబడి అక్కడికక్కడే అవసరమైతే తేజస్వీ సూర్యని నిలదీసి క్షమాపణ చెప్పించే విధంగా కార్యాచరణ ఉండేదని, కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా సమావేశంలో చాలామంది వక్తలు అభిప్రాయ పడ్డారని చెప్పారు.
అక్కడ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నా చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూస్తూ కూర్చున్నారు తప్ప తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చినా కనీస స్పందన లేకుండా మరి నిశ్చేష్టులుగా ఏదైతే చూస్తా ఉన్నారో దాన్ని సమావేశం తీవ్రంగా నిరసించిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు దయచేసి తెలంగాణ పార్టీ ఎంపీలు బీఆర్‌ఎస్ ఎంపీలు లేని లోటు ఏ రకంగా ఉందో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
నాకు కూడా తేజస్వీ సూర్య ఫోన్ చేశారని, ‘బ్రదర్ నేనేదో అన్నాను, తప్పుగా అర్థం చేసుకున్నారు మీవాళ్లు అంటే.. లేదండి మీరు మాట్లాడింది చాలా తప్పు అని’ మొఖం మీదనే చెప్పానని వెల్లడించారు. మేము ఖండించిన తర్వాతనే ఆయన ఏదో వివరణ ఇచ్చుకున్నారని, నా ఉద్దేశం అదికాదు ఇదికాదు, కాంగ్రెస్‌ను నిలదీయడం అని వివరణ ఇచ్చుకున్నారని గుర్తు చేశారు.
పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని, రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన అన్ని కమిటీలను రద్దు చేశారని చెప్పారు. త్వరలోనే వీటి పునర్నియామకం జరుగుతుందని, గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని తెలిపా రు. అనుబంధ సంఘాలను పటిష్టం చేయాలని కూడా సూచించారని వెల్లడించారు.
మీ పరిస్థితేంటో సీఎం చూసుకోవాలి
సీఎం హోదాలో ఉండి, ఇలాంటి ’చీప్’ మాటలు మాట్లాడటం పద్ధతి కాదని, మీరు ఒక ముఖ్యమంత్రిగా విధానపరమైన అం శాల మీద మాట్లాడితే, ప్రధాన ప్రతిపక్షంగా మేము స్పందిస్తాం, మీకు జవాబిస్తామని స్పష్టం చేశారు. కానీ, మీకు విషయం మీద మాట్లాడే అవగాహన లేదని, ఎంతసేపూ విషం చిమ్మడం, వ్యక్తిగత దూషణలు, అస భ్య పదజాలం తప్ప రేవంత్‌రెడ్డికి ఇంకోటి రాదని ఎద్దేవా చేశారు. ఆయన మా పార్టీ ఎక్స్ పైరీ అయిపోయిందని మాట్లాడుతున్నారని, అసలు కాంగ్రెస్ పార్టీ చితికిలపడి ఎన్ని ఏళ్లయింది? పన్నెండు, పదమూడేళ్లుగా ఆ పార్టీ లేవలేకపోతోందని గుర్తు చేశారు.
ముందు మీ స్థాయి ఏంటో, మీ పరిస్థితి ఏంటో చూసుకోవాలని, జాతీయ పార్టీ అని చెప్పుకునే మీరు, ఒక ప్రాంతీయ పార్టీ స్థా యికి పడిపోయారు. మీ సంగతి మీరు చూ సుకోండి, మా గురించి మీకెందుకు అని హితవు పలికారు. మా పార్టీ ప్రస్థానం ఏం టో, మా పార్టీ ఏం సాధించిందో, ప్రజా పో రాటాలతో ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని ఎలా సాధించుకున్నామో మీ జాతీయ నా యకత్వాన్ని అడిగితే చెబుతారని సూచించా రు. సీఎం ఇప్పటికైనా దిగజారుడు మాటలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
మా పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం గానీ, అగత్యం గానీ నాకు లేదని స్పష్టం చేశారు. దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పిన వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం? దేవుళ్లందరినీ ఆయన మోసం చేశారని మండిపడ్డారు. ‘బాసర వెళ్లి సరస్వతీ అమ్మవారి మీద ఒట్టేసి రుణమాఫీ చేస్తానన్నారు.. తీరా బయటకొచ్చాక ఆ మాట మరిచిపోయారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మాట ఇచ్చారు.
జోగులాంబ అమ్మవారి వద్ద ఒట్టు పెట్టారు’ ఇలాంటి సీఎం గురించి ఏం చెప్పాలన్నారు. ఆయన వ్యక్తిత్వానికి కానీ, ఆయన మాటలకు కానీ ఏమైనా విలువ ఉందా? ఏదో టైం పాస్ కోసం మాట్లాడుతుంటారని, ‘చీట్ చాట్’ పేరిట లీకులు ఎందుకు ధైర్యం ఉంటే ఆయన్ని బయటకు వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. కనీసం కేసీఆర్ అయి నా తన పేరు ఒకసారి ప్రస్తావిస్తారేమో అని ఆరాటపడుతున్నారు, కానీ కేసీఆర్ ఆయన పేరు కూడా ఎత్తడం లేదు.
ఆ బాధ వర్ణనాతీతమని ఎద్దేవా చేశారు. ‘రేవంత్ రెడ్డి... మి మ్మల్ని యాంకర్లు, యాక్టర్లు, ప్రజలు, చివరకు ప్రతిపక్ష నాయకుడు కూడా గుర్తించడం లేదు. ఇది మీ వ్యక్తిగత గుర్తింపు సమస్య. దానికి మేమేం చేయగలం? కావాలంటే ‘ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం’ అని బ్యానర్ కట్టుకుని ఊరూరు తిరగండి’ అని హితవు పలికారు.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు...
* రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. లేనిపక్షంలో గ్రామగ్రామాన పోరాటం చేస్తాం.
* 30 ఏళ్లుగా ఏదో ఒక అడ్డంకి కలిగిస్తూనే ఉన్నారని, మహిళా రిజర్వేషన్ల సాధన కోసం పార్టీ తరఫున పోరాడాలని నిర్ణయం.
* ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మొత్తం క్రియాశీలంగా ఉండాలి. చాలా సీరియస్‌గా తీసుకోవాలి.
* పార్టీ కమిటీల రద్దు. కేవలం రాష్ట కార్యవర్గం మాత్రం కొనసాగుతున్నది.
* త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు (ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్)
* పార్టీ శ్రేణులకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు






