1 గంటలో నిర్ణయం చెప్పాలి
ముంబై, మే 29: క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ వినతి అందిన ఒక గంటలోగా నిర్ణయాన్ని తెలియపర్చాలంటూ ఆరోగ్య బీమా కంపెనీలను ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఆదేశించింది. ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) బుధవారం హెల్త్ ఇన్సూరెన్స్‌పై ఒక మాస్టర్ సర్క్యులర్ జారీచేసింది. నూరుశాతం క్యాష్‌లెస్ క్లెయిం సెటిల్‌మెంట్‌ను సమయానికి అనుగుణంగా జరగాలని సూచించింది. క్యాష్‌లెస్ ఆథరైజేషన్ రిక్వెస్ట్‌లపై తక్షణం ఒక గంటలోపుగా నిర్ణయం తెలియపర్చాలని, హాస్పిటల్ నుంచి డిస్‌ఛార్జ్‌పై హాస్పిటల్ నుంచి రిక్వెస్ట్ అందిన మూడు గంటల్లోగా ఫైనల్ ఆథరైజేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
ఆరోగ్య బీమా సాధనాలపై గతంలో జారీ అయిన 55 సర్క్యులర్లను పునరుద్ఘాటిస్తూ ఈ మాస్టర్ సర్యులర్‌ను విడుదల చేసింది. పాలసీదారుల ప్రయోజనాలకు అనుగుణంగా ఆరోగ్య బీమా విస్తరించాలన్న లక్ష్యంతో దీనిని రూపొందించినట్టు ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఆరోగ్య బీమా పాలసీ కలిగినవారికి ఇబ్బందులు లేకుండా, వేగంగా క్లెయింలు జరిగేలా తీసుకోవాల్సిన చర్యల్ని సర్క్యులర్‌లో వివరించింది. అన్ని వయస్సులవారికి, ప్రాంతాలవారికి, వివిధ ఆరోగ్య పరిస్థితులు కలిగినవారికి, అన్ని రకాల హాస్పిటల్స్‌కు, హెల్త్‌కేర్ ప్రొవైడర్లకు తగిన ఆరోగ్య బీమా సాధనాలు/యాడ్‌ఆన్స్/ రైడర్స్‌ను అందించాలని బీమా కంపెనీలకు సూచించింది.
కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ ఇవ్వాలి
ప్రతీ పాలసీ డాక్యుమెంట్‌తో కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్) ఇవ్వాలని ఆదేశించింది. ఇన్సూరెన్స్ రకం, బీమా మొత్తం, కవరేజి వివరాలు, తొలగింపులు, ఉప పరిమితులు, తగ్గింపులు, వేచి చూడాల్సిన సమయం తదితర సులభ పదాలతో ఇన్సూరెన్స్ పాలసీల డాక్యుమెంట్‌ను రూపొందించాలన్నది. పాలసీ సమయంలో క్లెయింలు లేకపోతే పాలసీహోల్డర్లకు నో క్లెయిం బోనస్ వంటివి ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలన్నది. బీమా మొత్తాన్ని పెంచడం లేదా ప్రీమియం నుంచి డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా ఈ సదుపాయాన్ని కల్గించాలని ఆదేశించింది.
హాస్పిటల్స్ నుంచే డాక్యుమెంట్లు తీసుకోవాలి
క్లెయిం సెటిల్‌మెంట్ల కోసం పాలసీహోల్డర్లు ఎటువంటి డాక్యుమెంట్లు బీమా కంపెనీలకు సమర్పించాల్సిన అవసరం లేదని ఐఆర్‌డీఏఐ ఆ సర్క్యులర్‌లో స్పష్ఠం చేసింది. ఇన్సూరెన్స్ సంస్థలు, టీపీఏలే సంబంధిత డాక్యుమెంట్లను హాస్పిటల్స్ నుంచి కలెక్ట్ చేసుకోవాలని ఆదేశించింది. చికిత్స సందర్భంగా మరణం సంభవిస్తే మృతదేహాన్ని హాస్పిటల్స్ తక్షణం బంధువులకు అప్పగించాలని సర్క్యులర్‌లో పేర్కొంది.






