గోదాంగా మారిన మార్కెట్ యార్డు
- కేసముద్రం మార్కెట్ నిండా మార్క్ ఫెడ్ మక్కలే..!
- కొనుగోళ్లకు ఆటంకం వర్షాకాలంలో ఇబ్బందులు
కేసముద్రం, జూన్ 9 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో మార్క్ ఫెడ్ సంస్థ ఇటీవల రైతుల నుంచి కొనుగోలు చేసిన 2.75 లక్షల బస్తాల మక్కలను నిలువ చేసింది. ఇతర ప్రాంతాల్లో గోదాములు నిండిపోవడంతో చివరకు ఈ ప్రాంతంలో కొనుగోలు చేసిన మక్కలను ఇక్కడే నిలువ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనితో కేసముద్రం మార్కెట్ లో ఉన్న నాలుగు అత్యాధునిక ఫుల్ కవర్ షెడ్లలో మూడింటిలో, ఒక గోదాములో మక్కలను నిలువ చేయడంతో మార్కెట్ దాదాపు మార్క్ ఫెడ్ గోదాముగా మారిపోయింది.
దీనితో కేసముద్రం మార్కెట్లో నాలుగు ఓపెన్ షెడ్లలో మూడు షెడ్లలో మక్కలను నిలువ చేయడంతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఇబ్బందిగా మారింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో ప్రత్యక్ష పద్ధతి ద్వారా జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ (ఈ నామ్) విధానంలో రైతుల నుంచి వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. ప్రతి రైతు తాము పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్ యార్డ్ కు తెచ్చిన తర్వాత రాశులుగా పోయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి, ధరలను ఆన్ లైన్ ద్వారా ఖరారు చేసి టెండర్ వేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు టెండర్ ఓపెన్ చేసి , వ్యవసాయ ఉత్పత్తులను కాంటా వేసి, ఆ తర్వాత రైతులకు తాము విక్రయించిన వ్యవసాయ ఉత్పత్తులకు తగ్గ నగదు చెల్లింపులు చేస్తారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ధాన్యం, పత్తి, పసుపు, మక్కలు, మిర్చి, వేరుశనగ, అపరాలు, తదితర పంట ఉత్పత్తులను విక్రయించడానికి రైతులు తెస్తారు.
రోజుకు అన్ సీజన్ లో కనీసం 5 వేల బస్తాల నుంచి, సీజన్లో 20 నుంచి 40 వేల బస్తాల వరకు వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులను రైతుల విక్రయానికి తెస్తారు. ఇందుకోసం కేసముద్రం మార్కెట్లో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రత్యేకంగా పత్తి, ధాన్యం, పసుపు, మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం అత్యాధునికమైన ఓపెన్ కవర్ షెడ్లు నిర్మించి ఆయా పంటల ఉత్పత్తుల కొనుగోలు కోసం కేటాయించారు.
ఇప్పుడు వాటిలో మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసిన మక్కలను నిలువ చేయడంతో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయించడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. షెడ్లు మక్కలతో నింపడంతో ఓపెన్ యార్డు, ప్రైవేటు వ్యాపారుల సముదాయం వరండాలో వ్యవసాయ ఉత్పత్తులను రాశులుగా పోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో అకాల వర్షాలకు పంట ఉత్పత్తులు తడిసిపోయే పరిస్థితి నెలకొంది. గత వారం క్రితం రైతులు ఇదేవిధంగా ఆరు బయట ఓపెన్ యార్డులో పసుపు రాశులు పోయగా, వర్షానికి కొంతమేర తడిసింది.
ప్రస్తుతం వానాకాలం పంట సాగుకు పెట్టుబడి కోసం రైతులు ఇండ్లల్లో నిలువ చేసిన పంట ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ కు తెస్తుంటారు. వర్షా కాలంలో కేసముద్రం మార్కెట్లో షెడ్లల్లో పేరుకుపోయిన మక్కజొన్నలతో వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ప్రస్తుతం కేసముద్రం మార్కెట్ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
రెగ్యులర్ మార్కెట్ గా ఈ ప్రాంతంలో మంచి పేరు ఉన్న కేసముద్రం మార్కెట్ నిర్వహణకు మూడు ఫుల్ కవర్ షెడ్లలో మార్క్ఫెడ్ మక్కల నిలువల వల్ల ఇబ్బంది ఏర్పడింది. మక్కలు నిల్వచేసిన షెడ్లకు మార్క్ఫెడ్ సంస్థ పూర్తిగా గోదాము తరహాలో మార్చడానికి ప్రత్యేకంగా రేకులు అమర్చుతోంది. పగడ్బందీ ఏర్పాట్లు చేస్తుండడంతో ఇప్పట్లో షెడ్లు, గోదాములో నిలువచేసిన మక్కలను తీసే పరిస్థితి కనిపించడం లేదు.
దీనివల్ల కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళు ప్రశ్నార్ధకంగా మారనున్నాయి. ఫలితంగా మార్కెట్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారి, మనుగడ కష్టతరం కానుందనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు స్పందించి మక్కజొన్నలను తొందరగా క్లియర్ చేసి ‘రెగ్యులేటేడ్’ మార్కెట్ తిరిగి యధావిధిగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






