11 July, 2026 | 9:53 AM

రంగారెడ్డి జిల్లాలో నరమేధం: ఆరుగురిని మట్టుబెట్టిన సైకో!

11-07-2026 08:52 AM

​ఫోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఘోరం..

​ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు భార్యాపిల్లల దారుణ హత్య!

​షాబాద్ మండలంలో కలకలం సృష్టించిన కిరాతకుడు..

రంగారెడ్డి/చేవెళ్ల జులై 11 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా(Ranga Reddy district) షాబాద్ మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున అత్యంత కిరాతకమైన, హృదయవిదారకమైన సంఘటన చోటుచేసుకుంది. తనపై ఫోక్సో (POCSO) కేసు పెట్టారన్న కక్షతో ఒక సైకో ఉన్మాదిగా మారి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు కన్నబిడ్డలను, భార్యను కలిపి మొత్తం ఆరుగురిని దారుణంగా హతమార్చాడు. ఈ దారుణ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

​కేసు పెట్టారనే కక్షతోనే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ మండల పరిధిలోని దైవాలగూడకు చెందిన ఓ మైనర్ బాలిక (17)ను అదే ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. దీనిపై సదరు బాలిక 2026 మే 16వ తేదీన తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు రాజ్‌కుమార్‌పై ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్లిన రాజ్‌కుమార్, తనపై కేసు పెట్టిన కుటుంబంపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు, శనివారం (2026 జులై 11) తెల్లవారుజామున పక్కా ప్రణాళికతో దారుణానికి ఒడిగట్టాడు.

​అత్యాచారం చేసి.. ఆపై నరమేధం!

తెల్లవారుజామున బాలిక నివాసానికి వెళ్లిన రాజ్‌కుమార్, ఇంట్లోని ముగ్గురిని అతి కిరాతకంగా నరికి చంపాడు. ఇందులో భాగంగానే సదరు మైనర్ బాలికను పొలాల్లోకి లాక్కెళ్లి, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి ప్రాణాలు తీశాడు. అంతటితో ఆగని నిందితుడు.. తన సొంత భార్య సరిత, మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెను కూడా దారుణంగా హత్య చేశాడు. అయితే, కన్నబిడ్డలను, భార్యను అతడు ఎందుకు చంపాడనేది ఇంకా మిస్టరీగానే ఉంది.

​తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం..

ఆరుగురిని హతమార్చిన అనంతరం నిందితుడు రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. "నేను ఆరుగురిని మర్డర్ చేశాను.. ఒకచోట ముగ్గురిని, మరోచోట ముగ్గురిని హతమార్చాను. నేను కూడా చనిపోతున్నాను" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. కంగుతిన్న తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.

​పోలీసుల గాలింపు..

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. పోలీసులు ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర కలకలంపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న ఉన్మాది రాజ్‌కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

​మృతుల వివరాలు:

చిట్యాల రుక్కమ్మ (65)

​చిట్యాల లక్ష్మీ (45)

​మైనర్ బాలిక (17)

​పార్వతి సరిత (30) - (నిందితుడి భార్య)

​పరీక్షిత్ (3) - (నిందితుడి కుమారుడు)

​దైవిక్షిత్ (2) - (నిందితుడి కుమార్తె)