11 July, 2026 | 3:06 AM

భూదందాలు!

11-07-2026 02:11 AM

పోర్టల్స్ పొరల్లో.. ‘ధరణి’ నుంచి ‘భూభారతి’ వరకు లొసుగులు

  1. సాంకేతిక లోపాలు ఆసరాగా అక్రమాలు 
  2. ఫోరెన్సిక్ ఆడిట్‌లో బట్టబయలు  
  3. నిగ్గుతేల్చనున్న ప్రత్యేక విచారణ కమిటీ 
  4.   15లోపు ప్రభుత్వానికి నివేదిక.. సర్వత్రా ఉత్కంఠ

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : తెలంగాణ భూముల డిజిటల్ పరిపాలన వ్యవస్థ మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, యాజమాన్య రికార్డుల్లో పారదర్శకత కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో అనేక సాంకేతిక లోపాలున్నట్లు  ఫోరెన్సిక్ ఆడిట్‌లో బట్టబయలైంది. అదే టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన భూభారతి పోర్టల్‌పైనా సమగ్ర పరిశీలన మొదలైంది.

ఇందుకోసం ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో ధరణిలో ఏం జరిగింది? భూ భారతిలోనూ అలాంటి లోపాలున్నాయా? భూముల రికార్డుల్లో అనధికార మార్పులు ఎలా జరిగాయి? కొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్‌తో ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకురానుంది? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  

లోపాల ఆసరాగా అక్రమాలు!   

ధరణి పోర్టల్‌లో జరిగినట్లు ప్రభుత్వం చెబుతున్న అక్రమాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చి నట్లు అధికారులు వెల్లడించారు. పోర్టల్ సాంకేతిక నిర్మాణంలో కొన్ని భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు కొన్ని మాడ్యూళ్లలో అనధికారికంగా ప్రవేశించి భూముల రికార్డుల్లో మార్పులు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

ఫోరెన్సిక్ ఆడిట్ ప్రకారం, వ్యవస్థలో ఉన్న భద్రతా బలహీనతల కారణంగా అనుమతి లేని యాక్సెస్‌కు అవకాశం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కొంతమంది వినియోగదా రులు తమ అధికార పరిధిని మించి రికార్డుల్లో మార్పులు చేసిన అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ మార్పు లు ఏ కాలంలో జరిగాయి, ఎంత మేరకు భూముల రికార్డులు ప్రభావితమయ్యాయి, వాటికి ఎవరు బాధ్యులు అనే అంశాలపై మరింత లోతైన విచారణ కొనసాగుతోంది.  ధరణి సాంకేతిక నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని భూ భారతి వ్యవస్థను అభివృద్ధి చేసినందున, అదే తరహా సాంకేతిక బలహీనతలు ఇందులో కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  

అన్ని కోణాల్లో పరిశీలన

ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.  ఈ కమిటీలో జిల్లా కలెక్టర్లు, ఐటీ శాఖ అధికారులు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రతినిధులు, సీఐడీ అధికారులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులు, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌కు చెందిన నిపుణులు సభ్యులుగా ఉన్నారు.

అవసరమైతే ఇతర శాఖల అధికారుల నుంచి కూడా సమాచారం సేకరించే అవకాశం కమిటీకి ఉంది.ధరణి, భూ భారతి పోర్టళ్లలో గుర్తించిన అక్రమాలపై సమగ్ర విచారణ, బాధ్యు లను గుర్తించి, వారిపై తీసుకోవాల్సిన శాఖాపరమైన, చట్టపరమైన చర్యలను ప్రభు త్వానికి సిఫార్సు చేస్తారు.  ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. 

కొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్ రూపకల్పన

ధరణి పోర్టల్‌పై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో భద్రతా లోపాలు గుర్తించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న సాంకేతిక నిర్మాణా న్ని పూర్తిగా సమీక్షించి కొత్త సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ను రూపొందించాలని తెలంగాణ ప్రభు త్వం నిర్ణయించింది. లోపాలను సరిదిద్దడం కాకుండా, మొత్తం సాంకేతిక వ్యవస్థనే అత్యాధునిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మించాలని నిర్ణయించింది.

కొత్త ఆర్కిటెక్చర్‌లో ప్రతి లాగిన్, ప్రతి డేటా మార్పు, ప్రతి అనుమతిని డిజిటల్‌గా నమోదు చేసే ఆడిట్ ట్రైల్, మల్టీ లేయర్ సెక్యురిటీ, కఠినమైన యూజర్ యాక్సెస్ నియంత్రణ, అన ధికార ప్రవేశాలను వెంటనే గుర్తించే సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు, డేటా ఎన్క్రిప్షన్ వంటి ఆధునిక భద్రతా ప్రమాణాలను అమలు చేసే అవకాశం ఉంది. ఈ కొత్త వ్యవస్థ అభివృద్ధి బాధ్యతను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెం టర్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయం గా ప్రాధాన్యత సంతరించుకుంది.  

‘ధరణి’పై ఆరోపణలు

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, యా జమాన్య రికార్డుల నిర్వహణను పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే లక్ష్యంతో అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. భూములకు సంబంధించిన అన్ని సేవలను ఒకే ఆన్‌లైన్ వేదికపై అందించడం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, అవినీతిని తగ్గించడం, రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తొలగించడం దీని ప్రధాన ఉద్దేశం.

ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టాదారు పాస్‌బుక్ జారీ, యాజమాన్య వివరాల నవీకరణ, భూముల రికార్డుల నిర్వహణ వంటి సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు. రిజిస్ట్రే షన్ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్‌గా జరిగే విధంగా వ్యవస్థను రూపొందించారు. దీంతో రైతులకు వేగంగా సేవలు అందుతాయని, రెవెన్యూ వ్యవస్థలో మానవ జోక్యం తగ్గి పారదర్శకత పెరుగుతుందని అప్పటి ప్రభుత్వం పేర్కొంది.

అయితే అమలులోకి వచ్చిన కొద్ది కాలానికే ధరణిపై వివాదాలు మొదలయ్యాయి. భూ ముల రికార్డుల్లో పొరపాట్లు, వారసత్వ మ్యుటేషన్లలో జాప్యం, సర్వే నంబర్ల మార్పు లు, భూముల వివరాలు కనిపించకపోవడం, రికార్డుల్లో తప్పులను సరిచేసుకునే అవకాశం లేకపోవడం వంటి అంశాలపై వేలాది మంది రైతులు, భూ యజమానులు ఫిర్యాదులు చేశారు. దీంతో ధరణి పోర్టల్‌పై రాజకీయ, న్యాయపరమైన వివాదాలు కూడా తలెత్తాయి.

ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే తీవ్ర విమర్శలు చేసింది. భూముల రికార్డుల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం, రైతులకు న్యాయం చేసే అప్పీల్ వ్యవస్థ లేకపోవడం, రికార్డుల్లో తప్పులు జరిగినా వాటిని సరిదిద్దుకునే అవకాశం చాలా పరిమితంగా ఉం డడం వల్ల వేలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించింది. దీం తోపాటు 20 లక్షల ఎకరాలకుపైగా నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించింది.

ఈ క్రమంలో 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థపై సమగ్ర సమీక్ష చేపట్టింది. పోర్టల్లో నమోదైన ఫిర్యాదులు, భూముల రికార్డుల్లో తలెత్తిన వివాదాలు, సాంకేతిక లోపాలపై విచారణకు ఆదేశించింది. అనంతరం ధరణి స్థానంలో భూ భారతి వ్యవస్థను తీసుకొచ్చి, భూముల రికార్డుల సవరణకు అవకాశం కల్పించడం, అప్పీల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, గ్రామస్థాయిలో విచారణకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి మార్పులు చేసింది.