4 September, 2026 | 8:13 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ వరదలు

04-09-2026 | 06:10am

ఉప్పొంగుతున్న నదులు

ముగ్గురు మృతి

16 వేల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

23 జిల్లాల్లో తీవ్ర ప్రభావం..ముమ్మరంగా సహాయక చర్యలు

లక్నో, సెప్టెంబర్ 2: ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలను వరదలు(Massive floods) ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని నదులన్నీ పొంగిపోర్లుతున్నాయి. వారణాసిలో గంగానది మహోగ్రరూపం దాల్చింది. చిత్రకూట్లో మందాకిని, బల్లియాలో గంగా, సరయూ, శారద, డియోహా, ఖక్రా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

గంగానదిలో హెచ్చరికస్థాయిని దాటి 70.28 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన 18 నెలల చిన్నారి ప్రియాన్ష్, అలాగే అమ్రోహాలోని గజ్రౌలాకు చెందిన షేరా(32), సురేష్(55) ప్రాణాలు కోల్పోయారు. అలాగే 36,287 పశువులు వరదల బారిన పడ్డాయి. ఈ వరదలు మొత్తం 35 జిల్లాలపై ప్రభావం చూపగా, 23 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 16,784 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో బుధవారం ఒక్కరోజే 3,042 మందిని రక్షించారు.

సహాయక మరియు రక్షణ చర్యల కోసం 1,499 పడవలు, మోటారు పడవలను రంగంలోకి దించామని, అలాగే 1,067 వైద్య బృందాలను సేవల్లో నిమగ్నం చేశామని ప్రభుత్వం తెలిపింది. చిత్రకూట్‌లో మందాకిని, బల్లియాలో గంగా, సరయూ నదుల నీటి మట్టాలు పెరగడం వల్ల సుమారు 20,500 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, సహాయం చేసేందుకు 83 పడవలను రంగంలోకి దించారు.

వరద సహాయక కేంద్రాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), ప్రావిన్షియల్ ఆరమ్డ్ కానిస్టేబులరీ పీఏసీ బృందాలను కూడా మోహరించారు. పిలిభిత్‌లో శారద, డియోహా, ఖక్రా నదులలో నీటి మట్టం పెరుగుతోంది. బన్‌బాసా నుంచి శారద నదిలోకి రెండు లక్షల క్యూసెక్కులకు పైగా, అలాగే నానక్ సాగర్ నుంచి డియోహా నదిలోకి 30,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేశారు. ఖక్రా వంతెన నీట మునగడంతో సుమారు 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

200 పడకల వైద్య కళాశాలలో, భూగర్భ కేబుల్ బాక్స్‌ల్లోకి వర్షపు నీరు చేరడం వల్ల ప్రధాన విద్యుత్ సరఫరా 34 గంటలకు పైగా నిలిచిపోయింది. పాలియా వద్ద శారద నది నీటి మట్టం 154.59 మీటర్ల ప్రమాద స్థాయి కంటే 35 సెంటీమీటర్ల ఎత్తులో స్థిరంగా ఉంది. మరోవైపు బిహార్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి.