1 August, 2026 | 7:05 PM

గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు

01-08-2026 05:53 PM

రాకపోకలకు తెర.. ముంపులో ఇళ్లు, పంటలు

పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు.. 

సహాయక చర్యలపై ఎమ్మెల్యే పాయం ఆరా

బూర్గంపాడు,(విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరగడంతో బూర్గంపాడు మండలంలో వరద ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బూర్గంపాడు–రెడ్డిపాలెం–సారపాక ప్రధాన రహదారిపై వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రధాన రహదారి జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, పలు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

లోతట్టు ప్రాంతాలు జలమయం

గోదావరి ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని అనేక ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముందస్తు అప్రమత్తతతో తహశీల్దార్ ప్రసాద్,ఎంపీడీవో జమలారెడ్డి,ఎస్ఐ మేడ ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రమాదకర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

నీట మునిగిన పంటలు.. రైతుల్లో ఆందోళన

వరద నీరు వ్యవసాయ భూములను ముంచెత్తడంతో వందల ఎకరాల్లో సాగు చేసిన వరి, పత్తి, మిర్చి తదితర పంటలు నీటిలో చిక్కుకున్నాయి. ఇప్పటికే సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వరద మరో పెద్ద దెబ్బగా మారింది. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.

ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన

ముంపు ప్రభావిత ప్రాంతాలైనా బూర్గంపాడు,సారపాక గ్రామాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైన చోట తక్షణ సహాయం అందించాలని ఆదేశించారు.

అప్రమత్తతే రక్షణ

గోదావరి నీటిమట్టం ఇంకా ఎత్తుగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద నీరు ప్రవహిస్తున్న రహదారులపై ప్రయాణించవద్దని, అధికారుల హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.