గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించేందుకు గ్రామ సభ నిర్వహించారు.గ్రామ సర్పంచ్ తోట శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్యం, వీధి దీపాల ఏర్పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై గ్రామస్థుల నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరించారు.గ్రామ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రజల సహకారంతో కార్యాచరణ రూపొందిస్తామని సర్పంచ్ తోట శ్రీనివాస్ తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సయ్య, గ్రామ కార్యదర్శి మోహన్,వార్డు మెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.






