పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం తొలి టీకాతో సమానమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే. కృష్ణ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టిన బిడ్డకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తేనె, చక్కెర నీరు, గ్లూకోజ్ నీరు వంటి ఇతర పదార్థాలు ఇవ్వొద్దన్నారు.
తొలి మూడు రోజులు ముర్రు పాలు శిశువులో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు విరేచనాలు, న్యుమోనియా వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయన్నారు. తల్లిపాలివ్వడం వల్ల తల్లి-బిడ్డల మధ్య అనుబంధం బలపడుతుందని, భవిష్యత్తులో మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుందని చెప్పారు. బాలింతలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ క్యాన్సర్లు, ఎముకల బలహీనత (ఆస్టియోపోరోసిస్) ప్రమాదం తగ్గడంతో పాటు ప్రసవానంతరం బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుందన్నారు.
అనంతరం గైనకాలజిస్ట్ డా. సౌమ్య బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారం, తగినంత నీరు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓ డా. రవిశంకర్, డా. అజీజ్, శిశు వైద్య నిపుణుడు డా. సిరాజుద్దీన్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. ఆర్. సురేష్‌బాబు, డా. కె. రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. భరత్ కుమార్ రెడ్డి, వైద్య అధికారి డా. సృజన, సీడీపీఓ శోభారాణి, ఉప జిల్లా మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.






