12 April, 2026 | 2:03 AM

భారీగా పుత్తడి నిల్వలు

12-04-2026 12:00 AM

సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పెట్టింది పేరు. భారతీయ సంస్కృతిలో పండుగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలతోపాటు బంగారానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతీయుల ఇళ్లల్లో ఏ శుభకార్యం జరిగినా సరే వీసమెత్తు బంగారమైనా కొనాల్సిందే. పేద, ధనిక అనే తేడానే లేదు, అందరికీ ప్రియమైనది పుత్తడి. పాతదైనా బంగారం బంగారమే. అందుకేనేమో పుత్తడిపై అపరిమితంగా మోజు పెంచుకున్న భారతీయులు సందర్భంతో సంబంధం లేకుండా బంగారాన్ని కొంటూనే ఉంటారు.

బంగారాన్ని తమ స్టేటస్ సింబల్‌గానూ భావించే భారతీయులు ఒంటినే కాదు, ఇంటిని కూడా బంగారుమయం చేస్తున్నారు. పుత్తడితో ఇనపెట్టెలను నింపేస్తున్నారు. ఇది చివరికి ఎంతవరకు వచ్చిందంటే, ప్రపంచంలోని 10 అతిపెద్ద రిజర్వ్ బ్యాంకుల వద్దనున్న బంగారం నిల్వల కంటే భారతీయుల వద్ద ఉన్న బంగారమే అత్యధికంగా పోగయ్యే పరిస్థితి ఏర్పడింది. భారతీయుల వద్ద సుమారు 25,000-30,000 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నాయని అసోచామ్ తాజాగా నివేదించింది.

భారత్, చైనా, అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, రష్యా, జపాన్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ దేశాల రిజర్వ్ బ్యాంకుల్లో ఉన్న పుత్తడి నిల్వల కంటే భారతీయుల వద్ద ఉన్న బంగారమే ఎక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, భారత్‌లోని ఆలయాలకు చెందిన బంగా రం నిల్వలను కలుపుకొంటే 50 వేల టన్నులు దాటొచ్చని ఈ నివేదిక వెల్లడించింది. వీటి విలువ సుమారు 830 లక్షల కోట్లు కావడం విశేషం. భారతీయుల వద్ద వ్యక్తిగతంగా ఉన్న బంగారం విలువే సుమారు 460 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అసోచామ్ తెలిపింది.

26 శాతం వాటాతో బంగారం కొనుగోలులో ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉన్న భారత్‌లోని బంగారం నిల్వలు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదు. భారత్‌లో బంగారానికి డిమాండ్ ఏటా అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. దీంతో భారీగా దిగుమతులు చేసుకోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే భారతీయుల బీరువాల్లో మూలుగుతున్న బంగారం ఆర్థిక వ్యవస్థలోకి రావాల్సిన అవసరాన్ని అసోచామ్ నొక్కిచెప్పింది.

ఏటా సుమారు 2 శాతం బంగారం మార్కెట్లోకి వచ్చినా 2047 నాటికి దాదాపుగా 40 శాతం విలువ చేకూర్చినట్టు అవుతుందని చెప్పింది. దీనివల్ల జీడీపీకి అదనంగా 7.5 ట్రిలియన్ డాలర్ల మేరకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది. తద్వారా భార త జీడీపీ 41.5 లక్షల కోట్ల డాలర్లకు చేరువవుతుందని అంచనా వేసింది. కాగా, గత కొంతకాలంగా యుద్ధాల మూలంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొనడంతో పెట్టుబడిదారులూ బంగారంపైనే దృష్టిసారించారు.

దీంతో పుత్తడి డిమాండ్ అమాంతం పెరిగింది. బంగారం దిగుమతుల మూలంగా రూపాయి విలువ కూడా పడిపోతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలుకు బదులుగా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం, ఇళ్లల్లో మూలుగుతున్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

దీనివల్ల డాలర్ అవసరాలు తగ్గి, రూపాయి బలపడుతుంది. అయితే, అదంత సులభం కాదు. గ్రామీణులకు షేర్ మార్కెట్‌పై సరైన అవగాహన లేకపోవడం, బంగారాన్ని భారతీయులు సురక్షితమైన పెట్టుబడిగా, సంపదగా, తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తుండటమే అందుకు కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.