కదం తొక్కిన కరెంటోళ్లు
సమాజానికి వెలుగులు పంచేందుకు రాత్రింబవళ్లు నిరంతరం శ్రమించే కరెంటోళ్లు తమ సమస్యల పరిష్కారం కోసం కదంతొక్కారు. శ్రమ దోపిడీ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ, తమ సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పోరుబాట పట్టారు. తెలంగాణలోని విద్యుత్ సంస్థలైన జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న 9 సంఘాలకు చెందిన ఆర్టిజన్ కార్మికులు జేఏసీగా ఏర్పడి ఉమ్మడి పోరుకు దిగారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 19,061 మంది ఆర్టిజన్లుగా సేవలను అందిస్తున్నారు. వారిలో ట్రాన్స్‌కోలో 3769, జెన్‌కోలో 3583, ఎస్పీడీసీఎల్‌లో 8244, ఎన్పీడీసీఎల్‌లో 3465 మంది సేవలందిస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులందరికీ ఒకే రకమైన సర్వీస్ నిబంధనలు వర్తింపజేస్తూ ఆర్టిజన్, అన్ మ్యాన్డ్, స్పాట్ బిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఆర్టిజన్ల కన్వర్షన్లపై ఆయా విద్యుత్ కార్మిక సంఘాలు గత 8 ఏళ్లుగా నిరంతరంగా అలుపెరుగని పోరాటాలు చేస్తున్నాయి.
అయినా ప్రభుత్వాలు వారి అభ్యర్థనను తోసిపుచ్చుతున్నాయి. అలాగే అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి, ఏపీఎస్‌ఈబీ నిబంధనలు వర్తింపజేస్తూ, గృహజ్యోతి పథకం ద్వారా బిల్లింగ్ కార్మికులను ఆదుకో వాలి. పీస్ రేట్ కార్మికులకు జీవో నెం.11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేస్తూ 30 రోజుల పని కల్పించాలి. ఆర్టిజన్లను విద్యార్హత ఆధారంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులందరికీ పనికి తగిన వేతనం అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్, అన్ మ్యాన్డ్, డిస్ట్రిబ్యూషన్ వర్కర్, బిల్ కలెక్టర్ల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి, నాటి సీఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన పీపు ల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేస్తామని, అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తిస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలను నెరవేర్చి వేలాది విద్యుత్ కార్మిక కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది.
ఈదునూరి మహేష్,
జర్నలిస్ట్, 9949134467




