11 August, 2026 | 1:50 AM

భారీ కుంభకోణం

11-08-2026 12:00 AM
  1. పీఎం ఏక్తా మాల్ టెండర్లు రద్దు చేయాలి
  2. వాటిపై స్వతంత్ర విచారణ జరిపించాలి
  3. ప్రజా భూమి, కేంద్ర నిధులను డెవలపర్‌కు దోచి పెడుతున్న రేవంత్‌రెడ్డి
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  5. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ 

హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని రాయదుర్గ్‌లో ప్రతిపాదించిన పీఎం ఏక్తా(యూనిటీ) మాల్ టెండర్లలో ఆర్థిక అక్రమాలు, భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. యూనిటీ మాల్ టెండర్లలో కావాలనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అక్రమమైన, అనుమానాస్పద నిబంధనలు పెట్టి, ప్రజా వనరులను తాకట్టు పెట్టి ప్రైవేటు డెవలపర్‌కు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు.

ఆ టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సోమవారం లేఖ రాశారు. ప్రాజెక్టుపై ఎటువంటి తుది నిర్ణయాలు తీసుకోకముందే, ప్రవేట్ సంస్థల జేబుల్లోకి వెళ్లే కేంద్ర నిధుల విడుదలను తక్షణమే నిలిపివేయాలని, మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూమి విలువ కాకుండా, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ. 2,059.81 కోట్లు అని, దీనిలో భారీ అక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతుందని కేటీఆర్ లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 202 కోట్ల కేంద్ర సహాయం మంజూరైందని గుర్తుచేశారు.

రాయదుర్గ్‌లోని అత్యంత విలువైన 6.30 ఎకరాల స్థలంలో, సుమారు 27 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ఈ ప్రాజెక్టును తలపెట్టారని తెలిపారు. ఈ టెండర్లలో కమర్షియల్ స్థలం కేటాయింపు తీవ్ర అనుమానాలకు తావిస్తోందని ఆక్షేపించారు. ప్రాజెక్టులో ప్రభుత్వానికి దక్కే కనీస వాటా కేవలం 9 లక్షల చదరపు అడుగులు కాగా, ప్రైవేటు డెవలపర్‌కు మాత్రం కనీసం 18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారని ఎత్తిచూపారు. 

ప్రైవేట్ డెవలపర్‌కు హక్కులెందుకు?

ఎంపిక చేసిన డెవలపర్ కన్సార్టియంలో వంశీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీడ్ మెంబర్‌గా, అపర్ణ ఇన్‌ఫ్రా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామిగా ఉన్నాయని కేటీఆర్ వివరించారు. టెండర్ మూల్యాంకనం ప్రకారం.. ఈ కన్సార్టియం ప్రభుత్వానికి లభించే కనీస వాటా కంటే అదనంగా 18 వేల చదరపు అడుగుల గ్రేడ్-ఎ కమర్షియల్ స్థలాన్ని ఇచ్చేందుకు ప్రతిపాదించిందని, దీంతో ప్రభుత్వానికి దక్కే మొత్తం నిర్మిత ప్రాంతం 9.18 లక్షల చదరపు అడుగులకు చేరుతుందని తెలిపారు.

అయితే, ప్రైవేటు డెవలపర్‌కు మాత్రం కనీసం 18 లక్షల చదరపు అడుగుల స్థలంతో పాటు, భవిష్యత్తు ప్రణాళికలు లేదా పర్మిసిబుల్ ఎఫ్‌ఎస్‌ఐ ద్వారా వచ్చే అదనపు ప్రాంతాన్ని కూడా పొందే హక్కును కల్పించారని పేర్కొన్నారు. ఖరీదైన ప్రభుత్వ భూమి, కేంద్ర నిధులు మంజూరవుతున్న ప్రాజెక్టులో ప్రైవేటు డెవలపర్‌కు ఇంత భారీ మొత్తంలో కమర్షియల్ హక్కులు ఎందుకు కల్పిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేటాయిస్తున్న ప్రజా వనరులకు తగిన విలువ తెలంగాణ ప్రజలకు దక్కుతోందా లేదా అని ఆయన ప్రశ్నించారు. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద పీఎం యూనిటీ మాల్ కోసం మంజూరైన రూ. 200 కోట్ల వడ్డీ లేని రుణాన్ని తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా సదరు డెవలపర్‌కు నిధులు మళ్లించేలా టెండర్ నిబంధనలు రూపొందించారని తెలిపారు. 

చర్యలు తీసుకునే వరకు పోరాటం

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, అవినీతిపై స్వయంగా ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులు బహిరంగంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ, బీఆర్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యక్ష చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు, సందేహాలకు తావిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అమృత్ టెండర్ల అక్రమాలు, బొగ్గు కుంభకోణం వంటి అనేక అవినీతి వ్యవహారాలపై ఆధారాలతో సహా సదరు అధికారుల దృష్టికి తీసుకెళ్లి, స్వతంత్ర విచారణలు జరిపించాలని బీఆర్‌ఎస్ వరుసగా పోరాడుతోందని గుర్తుచేశారు. ప్రైవేటు సంస్థలకు అక్రమ లబ్ధి చేకూరినట్లు తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టం ముందు నిలబెట్టే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆగదన్నారు.