11-11-2025 12:52:42 PM
గద్వాల: స్వాతంత్య్ర సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. మంగళవారం భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల ఐడిఓసి వద్ద ఆయన చిత్రపటానికి కలెక్టర్ బీ.ఎం.సంతోష్, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మౌలానా అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ తదితర అనేక భాషల్లో ప్రావీణ్యత పొందారన్నారు. హిందూ, ముస్లిం ఐక్యత ఆధారంగా ఆల్ బలగ్ అనే పత్రికను ప్రారంభించి భారత జాతీయ వాదిగా పేరుగాంచారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచి అన్ని వర్గాల ప్రజలు స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా కీలకపాత్ర పోషించారన్నారు.
దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా 11 ఏళ్ల పాటు పనిచేసిన మౌలానాకు మరణాంతరం 1992లో భారతరత్న పురస్కారం లభించిందన్నారు. విద్య లేకుండా దేశము అభివృద్ధి చెందదని, విద్య స్వాతంత్రానికి రెండో రూపముగా పేర్కొన్న మౌలానా భారత విద్యావ్యవస్థకు బలమైన పునాదివేసిన మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్చార్జి జిల్లా అధికారి నిషిత, ఏవో భూపాల్ రెడ్డి, ఇతర అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మైనారిటీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.