1 May, 2026 | 3:34 PM

హక్కుల సాధనకై ఉద్యమించాలి

01-05-2026 02:21 PM

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ

బిజినేపల్లి: ఉద్యమాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులు నేడు ప్రపంచీకరణ ప్రభావంతో ప్రమాదంలో పడిపోయాయని, కార్మికులు మరోసారి తమ హక్కుల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి కృష్ణాజీ అధ్యక్షతన 141వ మే డే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం. బాల నరసింహ మాట్లాడుతూ, ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, వాటి రక్షణ కోసం కార్మికులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

దాదాపు 140 సంవత్సరాల క్రితం సాధించిన ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలనే కుట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్, నాయకులు మధు గౌడ్, చిన్నపాగ శ్రీను, రవి, సాయిలు, నారాయణ, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.