మే నెల ఉత్పత్తిలో వెనుకంజ
శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్
మంచిర్యాల, జూన్ 1 (విజయక్రాంతి): శ్రీరాంపూర్ ఏరియాలోని భూగర్భ, ఓపెన్ కాస్ట్ గనులు మే నెల ఉత్పత్తి లక్ష్యసాధనలో వెనుకబడిందని శ్రీరాంపూర్ ఏరియా జిఎం మునిగంటి శ్రీనివాస్ వెల్లడించారు. శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని అన్ని భూగర్బ గనులు, ఉపరితల గనుల ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను శ్రీరాంపూర్ ఏరియా జీఎం సోమవారం విలేకరుల సమావేశంలో వివరించారు. శ్రీరాంపూర్ ఏరియా మే నెల ఉత్పత్తి లక్ష్యం 5,47,500 టన్నులకు గాను 3,16,447 టన్నులు సాధించినట్లు తెలిపారు.
ఇందులో భూగర్భగనులలో ఆర్ కే 5 గని 100 శాతం, ఆర్ కే న్యూటెక్ మైన్ 101 శాతం, ఎస్‌ఆర్పి 1 గని 118 శాతం ఉత్పత్తి సాధించగా ఎస్‌ఆర్పీ 3 , ఆర్కె 7 గనులు 96 శాతంతో స్వల్ప దూరంలో నిలవగా ఐ కే 1ఏ 85 శాతంతో వెనకబడిందనీ, ఓవర్ ఆల్ గా భూగర్భ గనులు 96 శాతం ఉత్పత్తి సాధించాయన్నారు.
ప్రైవేట్ కాంట్రాక్ట్ ఒప్పంద సమస్యల కారణంగా ఓసీలలో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి జరగలేదన్నారు. శ్రీరాంపూర్ ఓసీలో ఇప్పటికే ఒక ప్రైవేట్ కాంట్రాక్టు పనులు కొనసాగుతుండగా జూన్ 3 నుంచి మరొక ప్రైవేట్ కాంట్రాక్టు ప్రారంభమవుతుందన్నారు. దీంతో ఎస్‌ఆర్పీ ఓసీలో ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తి శాతం పెరగనున్నట్లు తెలిపారు. ఐకే ఓసీ కీ సైతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందనీ, త్వరలోనే అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం నిర్దేశించిన 64 లక్షల 30 వేల టన్నుల టార్గెట్ సాధనకు ముందస్తు ప్రణాళికలతో కృషి చేస్తున్నామన్నారు.
గనుల వారీగా క్షేత్రస్థాయిలో ఉత్పత్తి సాధనే లక్ష్యంగా ఏప్రిల్ 18 నుంచి 23 వరకు మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలు నిర్వహించినట్లు, ఎండీటీ సమావేశాల్లో సంస్థ వాస్తవ పరిస్థితులు వివరించి సంస్థ మనుగడకోసం అందరు సమిష్టిగా కృషిచేయాలని వివరించినట్లు తెలిపారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం జరిగే తెలంగాణ రన్, ర్యాలీతో పాటు సాయంత్రం ప్రగతి స్టేడియంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో అధికారుల, ఉద్యోగులు , కుటంబ సభ్యులు, శ్రీరాంపూర్ ప్రజలు పెద్దె ఎత్తున పాల్గొనాలని కోరారు.
కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు...
కారుణ్యనియామకాల ప్రక్రియ ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలో మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన 3896 మంది ఉద్యోగుల వారసులకి ఉద్యోగాలు కల్పించామని జీ ఎం శ్రీనివాస్ వెల్లడించారు. 283 మంది ఉద్యోగులకు ఎల్‌ఎస్పీ చెల్లింపు, 23 మందికి ఎంఎంసీ చెల్లించటం జరిగిందన్నారు. ఉద్యోగ విరమణ పొందిన 9,757 మంది ఉద్యోగులకు సీపీఆర్‌ఎంఎస్ క్రింద శ్రీరాంపూర్ ఏరియాలో మెడికల్ కార్డులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, సీనియర్ పీఓ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.






