దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి): జిల్లాలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, సంక్షేమ, వైద్య, విద్య, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో దోమల వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దోమల వలన వ్యాప్తి చెందే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని, గ్రామీణ నీటి సరఫరా అధికారులు నీటి ట్యాంకులు క్రమం తప్పకుండా శుభ్రపరచాలని, పైప్ లైన్ల లీకేజీలు లేకుండా అవసరమైన మరమ్మత్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శులు దోమల స్ప్రే, ఆయిల్ బాల్, ఫాగింగ్ యంత్రాలను సిద్ధం చేసుకోవాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు.






