డీఎస్సీ ఎక్కడ?
- టెట్ పరీక్షలతోనే కాలయాపన చేస్తున్న ప్రభుత్వం
- గత డీఎస్సీ తర్వాత ఇప్పటికే మూడుసార్లు టెట్ నిర్వహణ
- తాజాగా నాలుగోసారి టెట్ నోటిఫికేషన్ జారీ
- తక్షణమే 10 నుంచి 15 వేల పోస్టులతో డీఎస్సీ వేయాలంటున్న అభ్యర్థులు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆవే దన అంతా ఇంతా కాదు. రాష్ట్ర ప్రభు త్వం చెప్పినట్లుగానే ఏడాదికి రెండుసా ర్లు.. ఆరు నెలలకు ఒకటి చొప్పున టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నోటిఫికేషన్‌ను జారీచేస్తోంది. కానీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మాత్రం వేయాల్సి డీఎస్సీ నోటిఫికేషన్‌ను వేయడంలేదు. డీఎస్సీ నోటిఫికేషన్ వేయకుండా కేవ లం ఈ టెట్ నోటిఫికేషన్‌తోనే సరిపెట్టుకోండనేలా ప్రభుత్వం తీరు కనిపిస్తోంది.
దీనిపై ఉద్యోగార్థుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డీఎస్సీ వేయకుండా ఇలానే టెట్ రాస్తూ ఎన్ని సంవత్సరాలు ఎదురుచూడాలని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే 10 వేల నుంచి 15 వేల పోస్టులతో డీఎస్సీ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం టెట్ నోటిఫికేషన్‌ను జారీచేస్తూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మభ్యపెడుతున్నదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గతంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేసి 2024 జూలై 20 నుంచి ఆగస్టు 5 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టిం ది. ఈ డీఎస్సీ తర్వాత మళ్లీ ఇంతవరకు మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్‌ను వేయలేదు. ఇప్పటికే మూడుసార్లు టెట్ నిర్వహించారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ టెట్ నోటిఫికేషన్ జారీచేశారు.
అంటే గత డీఎస్సీ తర్వాత మొత్తం నాలుగు టెట్ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఇలా ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ వేయకుండా టెట్ వేయడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇప్పటికే తొమ్మిదిసార్లు టెట్ నిర్వహిస్తే, డీఎస్సీ మాత్రం కేవలం రెండుసార్లే నిర్వహించడంతో నిరుద్యోగులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఊసెత్తని ప్రభుత్వం..
2017 అక్టోబర్ 21న డీఎస్సి ద్వారా 8,792 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీచేయగా, 2024 ఫిబ్రవరి 29న 10,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మాత్రం 2016, 2017, 2022, 2023లో టెట్ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2024 మేలో 2024 డిసెంబర్‌లో 2025 జూన్‌లో 2026 జనవరిలో టెట్ నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ 2026 ఏప్రిల్ 13న టెట్ నోటిఫికేషన్ జారీ చేసి జూన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
దీంతో తాము ఇంకెన్నిసార్లు టెట్ రాయాలని, డీఎస్సీ మాత్రం జాడా లేకుండా పోయిందని నిరుద్యోగులు వాపోతున్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు కూడా డీఎస్సీ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. 2024 డీఎస్సీ సమయంలోనే 5000 పోస్టులతో త్వరలోనే మరో నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లోనూ పేర్కొన్నప్పటికి అది ఇంతవరకూ అమలుకాలేదు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం మరొక డీఎస్సీ నోటిఫికేషన్ ఊసే ఎత్తడంలేదు.
15 వేల పోస్టులతో డీఎస్సీ వేయాలి..
ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 58 నుండి 61 ఏళ్లకు గతంలో పెంచారు. గత సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు వేలాదిమంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. మరోపక్క గత సంవత్సరం ఉపాధ్యాయ పదోన్నతుల వల్ల దాదాపుగా 6వేల టీచర్ పోస్టులు ఖాళీలుగా ఏర్పడ్డాయి. మొత్తంగా దాదాపు 15వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఎస్జీటీలు 10 వేలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్ సుమారుగా 4 వేల వరకు, మరో వెయ్యి పోస్టులు పీఈటీ ఇతరత్రా పోస్టులు ఉన్నాయని అంచనా. మరోపక్క వేసవి సెలవుల్లో టీచర్ల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టే యోచనలో విద్యాశాఖ ఉంది. ఈ క్రమంలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీచేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
3.50 లక్షల మంది డీఎస్సీ కోసం..
రాష్ట్రంలో దాదాపు 1.10 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు, 2.40 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులు ఉన్నారు. మొత్తంగా 3.50 లక్షల మంది డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో దాదాపు 3 లక్షల మంది ఇప్పటికే టెట్ పాసైనారు. ఇంకా వీరంతా టెట్ నోటిఫికేషన్ పడినప్పుడల్లా.. పదేపదే టెట్ రాస్తూనే ఉన్నారు. ఇలా ఇంకెన్నిసార్లు టెట్ పరీక్షలు రాయాలని అభ్యర్థులు వాపోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇలాగే టెట్ పరీక్షల పేరుతో కాలయాపన చేస్తూ ఎన్నికల ముందు ఓ డీఎస్సీ వేసి చేతులు దులుపుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ టెట్ ముగిసేలోగా డీఎస్సీ వేయాలి
టెట్‌లతో కాలయాపన చేయకుండా వెంటనే డీఎస్సీ వేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహిస్తూనే ఉన్నారు కానీ, మరో డీఎస్సీ త్వరలో జారీచేస్తామని ఆర్థిక శాఖ మంత్రితోపాటు ఇతర పలువురు మంత్రులు ఇచ్చిన హామీ ఏమైందన్నారు. తక్షణమే ఈ టెట్ ముగిసేలోగా డీఎస్సీపై చర్యలు తీసుకొని 15 వేల టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేస్తున్నాము. వేలాదిమంది నిరుద్యోగులు..తమ తల్లిదండ్రులను వదిలిపెట్టి నగరానికి వచ్చి డీఎస్సీ కోసం సన్నద్ధమవుతున్నాం. ప్రభుత్వం ఎన్నికల వరకు సాగదీయకుండా తక్షణమే డీఎస్సీ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
దుర్గం హరీష్, మంచిర్యాల, డీఎస్సీ అభ్యర్థి
ఇప్పటికే 10 సార్లు టెట్ రాశాం
మాకు టెట్ వద్దు. డీఎస్సీ కావాలి. ఇప్పటికే 10 సార్లు టెట్ రాశాం. ఇంకెన్ని సార్లు రాస్తూ ఉండాలి. తక్షణమే 15 వేల టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎక్కువ సంఖ్యలో భర్తీ చేయాలి. ఏళ్ల తరబడిగా డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నాం. గత డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు తక్కువ సంఖ్యలో భర్తీ చేశారు. దీనివల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. అలాగే మోడల్ స్కూల్, గురుకులాల్లోని ఖాళీ పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీచేయాలి.
డీ సుధారాణి, హన్మకొండ జిల్లా






