5 May, 2026 | 9:49 PM

కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి

05-05-2026 08:34 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద అన్ని గ్రామాల్లో కూలీల సమీకరణ (లేబర్ మొబిలైజేషన్)ను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఎన్ఐసి హాల్లో  జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)తో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ సహా పలు ముఖ్య అంశాలపై సమగ్రంగా చర్చించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద అన్ని గ్రామాల్లో కార్మికుల సమీకరణ (లేబర్ మొబిలైజేషన్)ను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీవోలు వెంటనే ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో అవసరం ఉన్న పనులకు సంబంధించు 20 పనుల జాబితా తయారు చేసుకుని, సర్పంచ్ ఆధ్వర్యంలో మేట్లు, కూలీలతో సమావేశం ఏర్పాటు చేసి పనుల గురించి వారికి తెలియజేయాలన్నారు. తద్వారా కూలీలు పనులకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. 

గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా కల్పించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే, ప్రతి గ్రామంలో మరుగుదొడ్లు లేని కుటుంబాలను గుర్తించి, స్వచ్ఛ భారత్ మిషన్ కింద వారికి తక్షణమే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని, శాతం వంద పూర్తి సాధించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎస్బీఎం కింద మరుగుదొడ్లకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.  ఇక అన్ని మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయి ఇంకా గ్రౌండింగ్ చేసుకోని వారిని గుర్తించి కారణాలు తెలుసుకోవాలన్నారు. ఒకవేళ వారు కట్టుకోవడానికి ఇష్టంగా లేకపోతే వాటిని కాన్సల్ చేయడానికి తన లాగిన్ కు పంపాలని కలెక్టర్ సూచించారు. తద్వారా కొత్తగా అర్హులైన వారికి కేటాయించడానికి అవకాశం ఉంటుందన్నారు. 

ఇంకా, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ (NFBS) పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన లబ్ధిదారులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. జనగణన 2027 లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా సిబ్బందికి తెలియజేయాలన్నారు. దాంతోపాటుగా ప్రజలు కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలన్నారు.