3 August, 2026 | 11:37 AM

ట్రాఫిక్ రద్దీ నివారణకు చర్యలు

22-06-2024 12:20 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి) : నగరంలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సమర్థవంతమైన వ్యూహాలు రచిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డా.జోయెల్ డేవిస్ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని పోనెక్స్ ఇన్ఫోసిటీ, సత్య నాలెడ్జ్ సిటీలో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలతో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సమావేశాన్ని ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, ఎస్‌సీఎస్ జనరల్ సెక్రటరీ రమేష్ కాజా మాట్లాడుతూ.. ట్రాఫిక్ రద్దీ నివారణే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు.

ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించడానికి పోలీసులు, వివిధ సంస్థల మధ్య సహాయ సహకారాలుండాలని చెప్పారు. ఈ సందర్భంగా కంపెనీలకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌ను తగ్గించడానికి పనివేళల్లో మార్పులు చేయాలని కంపెనీలకు సూచించారు. ట్రాఫిక్ రద్దీ, కర్బన ఉద్గారాలను  తగ్గించడానికి కార్ పూలింగ్ అవసరమన్నారు. ఉద్యోగులు ఆర్టీసీ, మెట్రో వంటి వాటిని ఉపయోగించుకోవడం ద్వారా ట్రాఫిక్‌ను నియంత్రించుకోవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ‘రెగ్యులర్ క్రైసిస్ మేనేజ్‌మెంట్’ ప్రాముఖ్యతను వివరించారు. ఈ వ్యూహాలను అమలు చేయడం ద్వారా ఉద్యోగులు, ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రయాణించవచ్చన్నారు.