7 April, 2026 | 3:38 AM

రణరంగం.. శాంతిరాగం

07-04-2026 01:53 AM
  1. ఇరాన్, అమెరికాకు మధ్య పలు దేశాల మధ్యవర్తిత్వం
  2. 45 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదనలు
  3. ‘హొర్ముజ్’ను తెరిపించేందుకు విశ్వప్రయత్నాలు
  4. ముసాయిదా అమెరికా, ఇరాన్‌కు చేరవేత
  5. సమాలోచనల్లో వైట్‌హౌస్ వర్గాలు బిజీ బిజీ

వాషింగ్టన్, ఏప్రిల్ 6: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో 45 రో జులపాటు కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) అంశంపై కొన్ని దేశాలు అందజేసిన ముసాయిదాపై వైట్ హౌస్‌లో ముమ్మరంగా సమాలోచనలు జరుగుతున్నాయి. అయితే, ఈ అంశంపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. హొర్మూజ్ జలసంధి ఇరాన్ గుప్పిట్లో ఉండటంతో ప్రపంచ దేశాల్లో చమురు సంక్షోభం వచ్చింది. దీంతో ట్రంప్ జలసంధిని తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భా గంగానే ఆదివారం ట్రంప్ ‘ఇరాన్ 48 గంటల్లో హొర్మూజ్ తెరవాలని లేకపోతే దాడులతో విరుచుకుపడతాం’ అని హెచ్చరించారు. మళ్లీ ఆ గడువును ట్రంప్ మరో రోజు కూడా పొడిగించారు.

ఈ చొప్పున ఇరాన్‌కు విధించిన గడువు భారత కాలమానం ప్రకా రం బుధవారం ఉదయంతో ముగుస్తుంది. తాము విధించిన గడువులోపు ఇరాన్ జలసంధిన విడిచిపెట్టకపోతే, ఆదేశంలోని విద్యు త్ ప్లాంట్లు, వంతెనలు నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. మౌలిక సదుపాయాలను ఎందుకూ పనికిరాకుండా చేస్తామని, చమురు నిల్వలను సైతం స్వాధీనం చేసుకుంటామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ట్రంప్ హెచ్చరికలపై ఇప్పటివరకు ఇరాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

దౌత్యపరమైన చర్చలు

ఇరాన్‌పై యుద్ధం నిలిపివేసేందుకు అమెరికా మొత్తం 15 షరతులు విధించిన సంగతి తెలిసిందే. ఆ షరతులు, ప్రతిపాదనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ఇప్పటికే ఇరాన్ విదేశాంగశాఖ కూడా స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భంలో పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు పాకిస్థాన్, జపాన్, తుర్కియే, ఈజిప్టు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ముసాయిదా సిద్ధం చేసి ఇరాన్, అమెరికాకు అందించాయి.

ముసాయిదాలో ఆ యా దేశాలు 45 రోజులపాటు కాల్పుల విరమణ, హొర్మూజ్ జలసంధిని తెరిచే ప్రతిప్రాదనలు పెట్టాయి. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తుందని ఆయా దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముసాయిదాను పరిశీలించే పనిలో అమెరికా, ఇరాన్ పడ్డాయి. మరోవైపు, యుద్ధం కారణంగా అనేక దేశాల్లో చమురు సంక్షోభం సాగుతూనే ఉంది. దీని ప్రభావంతో శ్రీలంకలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా 23 శాతం పెరిగాయి.

‘ఎయిర్ ఏషియా ఎక్స్’ వంటి సంస్థలు ఇప్పటికే తమ విమాన సర్వీసులను తగ్గించుకున్నాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. మరోవైపు వ్యవసాయానికి అవసర మైన ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉం దని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆహార సం క్షోభానికి దారి తీసే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలకు ఇరాన్ 10 ప్రధాన షరతులతో కూడిన ఒక నివేదికను అందజేసింది. హొర్ముజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉండాలని, అక్కడి నుంచి వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలు చేసే హక్కు కల్పించాలని ఇరాన్ కోరుతున్నది. తమపై ఉన్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడంతో పాటు అణు ఇంధన సుసంపన్నతకు గుర్తింపు ఇవ్వాలంటున్నది.