తోగ్గూడెంలో వైద్య శిబిరం
ములకలపల్లి,(విజయక్రాంతి): స్థానిక మంగపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం జగన్నాధపురం పంచాయతీలోని తోగ్గూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు.తోగ్గూడెం, చింతల కాలనీ(వలస ఆదివాసీ గ్రామం)లో నిర్వహించిన వైద్య శిబిరంలో వైద్యాధికారి సాయి కళ్యాణ్ వైద్య చికిత్సలు అందజేశారు. పదిమంది జ్వర పీడితులకు మలేరియా పరీక్ష నిర్వహించగా మలేరియా లేదని నిర్ధారణ అయ్యింది. సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి ఇంటి చుట్టుపక్కల పరిసరాలను గమనించి ఇంటి పరిసరాల్లో ఉన్న చిన్న చిన్న డబ్బాలలో, టైర్లలో నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు తగు సూచనలు ఇచ్చినారు.
ప్రస్తుతం వస్తున్న జ్వరాలు సాధారణంగా సీజన్లో వచ్చే వైరస్ జ్వరాలని ఈ సీజన్లో ప్రజలు తాగే నీరు వేడి చేసుకుని చల్లార్చిన నీరు తాగితే ఎటువంటి అనారోగ్యం రాదని అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇండ్ల చుట్టూ ప్రక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని తద్వారా దోమలు పెరగవని అంటు వ్యాధులు వ్యాపించవని వైద్యాధికారి తెలిపారు. ఈ వైద్య శిబిరంలో జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






