శ్రావణమాసం... కాళేశ్వరంలో భక్తుల సందడి
14-08-2026 07:40 PM
కాళేశ్వరం,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదిపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయ బాలాలయంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరి తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ బాలాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పలువురు భక్తులు కాలసర్ప, శని దోష నివారణ పూజలు నిర్వహించుకుని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో మహేష్, చైర్మన్ మోహన్ శర్మ, పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన సేవలను అందించారు.






