25 June, 2026 | 1:46 AM

ముగిసిన మేడిపల్లి లేఅవుట్ ఈవేలం

25-06-2026 12:54 AM

బిడ్డర్లు, గృహ కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన

గరిష్ఠ బిడ్ చదరపు గజం రూ.80 వేలు

హైదరాబాద్, 24 జూన్ (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మేడిపల్లి లేఅవుట్‌లోని 68 నివాస ప్లాట్లకు నిర్వహించిన మూడో దశ ఈ-వేలం విజయవంతంగా పూర్తయింది. ఈ వేలానికి గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది.

హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బిడ్డర్లు పాల్గొనడం ద్వారా హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లపై మార్కెట్ విశ్వాసం బలంగా ఉందని, అలాగే సక్రమ ప్రణాళికతో రూపొందించిన నివాస ప్రాజెక్టులపై డిమాండ్ పెరుగుతున్నదని స్పష్టమైంది. మొత్తం 68 ప్లాట్లలో 63 ప్లాట్లు వేలం ద్వారా విక్రయించబడ్డాయి.

ఈ వేలంలో గరిష్ఠంగా చదరపు గజానికి రూ.80వేలు బిడ్ లభించగా, సగటు బిడ్ ధర చదరపు గజానికి రూ.56,260గా నమోదైంది. దీని ద్వారా సుమారు రూ.120 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది మేడిపల్లి ప్రాంత ఆకర్షణను మరింత స్పష్టం చేస్తోంది. పలు ప్లాట్లకు అనేక బిడ్లు రావడంతో బిడ్డర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ విజయవంతమైన ఈ-వేలం హైదరాబాద్ తూర్పు అభివృద్ధి కారిడార్‌లో మరింత అభివృద్ధి, పెట్టుబడులను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు.