25 June, 2026 | 1:46 AM

విద్యుత్‌శాఖలో రూ.1000 కోట్ల స్కాం

25-06-2026 12:55 AM
  1. మెగావాట్‌కు రూ.కోటి ఇవ్వాలని వేధింపులు 
  2. త్వరలోనే మరో కుంభకోణం బయటపెడతాం
  3. సీఎం రేవంత్‌రెడ్డివి మ్యాచ్‌ఫిక్సింగ్ డ్రామాలు
  4. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 24(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో మరో స్కామ్ జరిగిందని, దీన్ని త్వరలోనే బయటపెడతామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. పీఎం కుసుమ్ పథకంలో దాదాపు రూ.1000 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ నేతలు తెరలేపారని ఆరోపించారు. మెగావాట్‌కు కోటి రూపాయలను ఇంధన శాఖ, రెడ్కో అధికారుల్లో కొందరు డిమాండ్ చేస్తూ వేధించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొకిందని, కేసీఆర్ హయాంలోని పథకాలను కూడా అమలు చేయడం లేదని విమర్శించారు.

స్కీములు లేవు కానీ.. రోజు కో స్కాం వెలుగు చూస్తోందని పేర్కొన్నారు. మోదీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, జనసేన ఒక్కటే టీమ్ అని, మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా లు తప్ప ఇంకేమీ లేదని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌కు పీఏగా పనిచేస్తున్నారా? అని అన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పీఎం కుసు మ్ పథకంలో కూడా 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు.

చాలా మంది అప్పులు చేసి పీఎం కుసుమ్ పథకంలో చేరి ప్లాంట్ల నిర్మాణం చేశారని, 300 మెగావాట్ల వరకు ప్లాంట్ల నిర్మాణం పూర్తయి రెండు, మూడు నెలలు అయినా సింక్రనైజ్ చేసుకోవడం లేదని విమర్శించారు. ఇంధన శాఖ అధికారి ఒకరు, రెడ్కో అధికారి ఒకరు వారిని వేధించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. మెగావాట్‌కు కోటి రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశారని, ఇన్నాళ్లు సతాయిస్తూ వచ్చి, ఇప్పుడు కేంద్రం చెప్పిన ధర కంటే తక్కువ ధర అని చేతులెత్తేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వ పెద్దలు వారి రక్తం తాగుతున్నారని, ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినిపిస్తున్నాయని చెప్పారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించాలన్నారు. కేంద్రం రూ.3.13 ధర చెబితే... నిన్నటికి నిన్న ఒక ఉన్నతాధికారి రూ.2.90 అని ఎందుకు చెప్పాల్సి వచ్చిం ది? వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉందని అనుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో ఇంకో స్కాం కూడా ఉంది..

దాన్ని కూడా త్వరలోనే బయటపెడతామని తెలిపారు. వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటించడం దుర్మార్గమని, మంత్రులు వస్తే చూపిస్తామని జగదీశ్‌రెడ్డి పోస్టు చేశారు. మిగిలిన వడ్లను మొత్తం కొనుగోళ్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు తిర గబడతారు జాగ్రత్త అని, వానకాలం భరోసా ఇస్తామంటున్నారు.. యాసంగి భరోసా మొత్తం అయిపోయిందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 30 వేల కోట్ల బకాయి ఉందని, మొత్తం బకాయిలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్‌లో ఎన్నికలు పెట్టే ఉద్దేశంతో రైతుల్ని మళ్లీ మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పని అయిపోయిందని అంటున్న పీసీసీ చీఫ్.. ముందు ఆయన పదవి ఉంటుందో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. బీజేపీ, హైబ్రి డ్ కాంగ్రెస్ ఒక్కటే అని నిన్న తేలిపోయిందని, మొన్న ప్రధాని పిలిచారు.. మ్యాచ్ ఫిక్సింగ్‌లో తిట్టుకున్న ఇద్దరు (రేవంత్ రెడ్డి ,కిషన్‌రెడ్డి) ఢిల్లీలో డ్యూయెట్ పాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రికి పీఏగా పనిచేస్తున్నారా అని మండిపడ్డారు.