అంబూజా సిమెంట్స్‌తో పెన్నా, సంఘి ఇండస్ట్రీస్ విలీనం
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అదానీ గ్రూప్ ఇటీవల టేకోవర్ చేసిన సిమెంట్ కంపెనీలు సంఘి ఇండస్ట్రీస్, పెన్నా సిమెంట్‌లను అంబూజా సిమెంట్స్‌లో విలీనం చేయనుంది. ఈ మేరకు మంగళవారం అదానీ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను (పీసీఐఎల్), గుజరాత్‌లోని సౌరాష్ట్రలో నెలకొన్న సంఘి ఇండస్ట్రీస్ (ఎస్‌ఐఎల్)ను విలీనపర్చుకునే వేరువేరు స్కీమ్‌లకు మంగళవారం సమావేశమైన అంబూజా సిమెంట్స్ బోర్డు ఆమోదం తెలిపింది.
వివిధ అనుమతులకు లోబడి విలీ నం 9 నెలల నుంచి 12 నెలల్లో పూర్తవుతుందని పేర్కొంది. 2023 డిసెంబర్‌లో కొనుగోలు చేసిన సంఘి ఇండస్ట్రీస్‌లో అం బూజా సిమెంట్స్‌కు 58.08 శాతం వాటా ఉన్నది. విలీన ప్రతిపాదన కింద ఎస్‌ఐఎల్ షేర్‌హోల్డర్లకు ప్రతీ 100 ఈక్విటీ షేర్లకు అం బూజా సిమెంట్స్ 12 ఈక్విటీ షేర్లను జారీచేస్తుంది. పెన్నా సిమెంట్ షేర్‌హోల్డర్లకు ప్రతీ రూ.10 ముఖవిలువగల ఈక్విటీ షేరుకూ రూ.321.50 చొప్పున చెల్లిస్తుంది. పెన్నా సిమెంట్‌ను అదానీ గ్రూప్ 2024 ఆగస్టులో కొనుగోలు చేసింది. స్విట్జర్లాండ్ కంపెనీ హోల్సిమ్ నుంచి అంబూజా సిమెంట్స్‌ను 2022లో రూ. 51,000 కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది.




