16 April, 2026 | 1:12 AM

మా గోడు వినండి.. విద్యుత్ కార్మికుల విజ్ఞప్తి

16-04-2026 12:12 AM

ముఖానికి నల్ల మాస్కులు ధరించి నిరసన

మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): న్యాయమైన కోరికల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో సమ్మె చేస్తున్నాం.. యాజమాన్యాలు స్పందించి మా గోడు ఆలకించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విద్యుత్ కార్మిక సంఘం జేఏసీ తొర్రూర్ డివిజన్ చైర్మన్ పసుపులేటి మధు విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ కార్మికులు మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూర్ డివిజన్ కార్యాలయం 8వ రోజు సమ్మె కొనసాగించారు. మహబూబాబాద్ డివిజన్ కార్యాలయం ముందు విద్యుత్ కార్మికులు ముఖానికి నల్ల మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ యాజమాన్యం చర్చలకు పిలవడం లేదని, మాగోడు ప్రభుత్వానికి, యాజమాన్యానికి పట్టి పట్టనట్లుగా ఉందన్నారు.

యాజమాన్యం ఎలాంటి నోటీసులుచ్చిన బయపడవద్దని, సమ్మె ముందస్తుగానే సమాచారం ఇచ్చామని, లేబర్ కమిషనర్ 17 చర్చలకు పిలిచారని, ఈ టైమ్ లో ఎలాంటి నోటీసులు ఇచ్చినా చెల్లవన్నారు. సమ్మెకు సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి సంఘీభావం తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఆర్టిజన్, అన్ మ్యాన్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, అన్ మ్యాన్డ్ కార్మికులందర్నీ రెగ్యులర్ పోస్టులోకి తీసుకొని కనీస వేతనం ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, మిగిలిన పీసీ రేట్ కార్మికులందరినీ తక్షణమే రెగ్యులర్ చేసి జీవో నెంబర్ 11 ప్రకారంగా వేతనం చెల్లించాలని, విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఒకే రూలు వ్యవస్థ ఏపీ ఎస్ ఈ బి  రూల్స్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ మచ్చ సతీష్, డివిజన్ కన్వీనర్ బంధారపు శ్రీను, కో చైర్మన్ నాగరాజు,కో కన్వీనర్ రమేష్ ఖాజాబీ, సునీల్ కుమార్,చంద్రప్రకాష్, జ్యోతి , సంధ్య, సుభాష్, ఖాజాపాషా, శంకర్, బిక్కు , బిచ్చనాయక్, అశోక్, సందీప్, రవికాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.